అభిమానులు.. పవన్ మాట కూడా వినడం లేదా..?

 

పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్లు.. అభిమానుల్లో పవన్ అభిమానులు వేరంటూ కొందరు సెటైర్లు వేస్తుంటారు. తమ అభిమాన నటుడిని దేవుడిలా పూజిస్తూ.. ఆయన్ని ఏమైనా అంటే ఊరుకునేది లేదన్నట్లుగా వీరు ప్రవర్తిస్తుంటారు. పద్దతి మార్చుకోవాలని ఎంతమంది.. ఎన్నిసార్లు సూచించినా వీరి వైఖరి మారడం లేదు. తన సినిమాలకు తప్పించి పెద్దగా బయటకి రాని పవన్ "చలోరే చలోరే చల్" యాత్ర పేరిట తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుందామని బయలుదేరాడు. తెరపై పవర్‌స్టార్‌ను చూస్తేనే పూనకాలతో ఊగిపోయే అభిమానులు.. ఆయన రోడ్ల మీద కనిపిస్తే వదులుతారా..? తెలంగాణలో పర్యటన ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు తన ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు పవన్

 

కారు అద్దాలు పగలడమో.. తోపులాటల వల్లనో పలువురు ఫ్యాన్స్ గాయాలపాలవుతున్నారు. ఖమ్మంలో అయితే పవన్ అభిమానుల తాకిడికి ఏకంగా ఓ పోలీస్ అధికారే ఆస్పత్రి పాలయ్యాడు. అలాగే హిందూపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అభిమానుల అత్యుత్సాహం కారణంగా గందరగోళం నెలకొని.. ఆడిటోరియంలోని అద్దాలు.. కిటికీలు పగిలిపోగా.. తోపులాటలో నలుగురు అభిమానులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స తీసుకుంటున్న ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

దీనిపై ఒకదశలో పవన్ సైతం అసహనం వ్యక్తం చేశారు.. నా మీద గౌరవం వుంటే దయచేసి కూర్చోవాలని కోరినప్పటికీ.. వారు వినలేదు. అభిమానుల అత్యుత్సాహం.. వారి స్పీడ్‌ను చూస్తుంటే తనకు చాలా భయంగా ఉందని సాక్షాత్తూ జనసేనాని భయపడ్డాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులు ఇబ్బందులు పడకూడదనే తాను సినిమా ఫంక్షన్స్ సైతం జరుపుకోనని.. కానీ ప్రజా సమస్యలను గురించి తెలుసుకునేందుకు ప్రజల్లోకి రాక తప్పలేదని.. కోట్లాది ప్రజల సమస్యలను ఇంట్లో కూర్చొని తెలుసుకోలేనని చెప్పారు. తన యాత్రకు వచ్చే అభిమానులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. తల్లిదండ్రులు.. భార్యబిడ్డలను గుర్తు చేసుకున్న తర్వాతే.. తన గురించి ఆలోచించాలని సూచించారు. ఎవరికి ఏమైనా ఓ అన్నగా తనకు బాధ కలుగుతుందని తనకు ఎటువంటి వేదనను కలిగించవద్దని వేడుకుంటున్నానని చెప్పారు.

 

చెప్పి చెప్పి ఆయన గొంతు నొప్పి పుట్టడమే తప్పించి అభిమానులు గాడిలో పడటం కల్లే అంటున్నారు విశ్లేషకులు. పవన్‌ని ఇంకా ఒక సినీనటుడిగానే చూస్తున్న జనం.. ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినేత అన్న విషయం మరచిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో ఏం చేసినా చెల్లిపోతుంది.. కానీ రాజకీయ పార్టీ అధినేతగా అభిమానులు ఏం చేసినా.. వారికి ఏం జరిగినా అందుకు నైతిక బాధ్యత పవన్‌దే. ఈ విషయాన్ని జనసేనాని అభిమానులు గుర్తుపెట్టుకోవాలని.. లేదంటే వారి వల్లే పవన్‌కు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.