వైకాపాకు పొట్లూరి బైబై.. మీడియా సృష్టేనా

 

ఎన్నికల ముందు రాజకీయ నేతలు ఒక పార్టీలో నుండి మరొక దానిలోకి కప్పగంతులు వేస్తూ, అందుకు యదోచితంగా వివరణ ఇచ్చుకొంటుంటారు. వారి సంజాయిషీలకు మీడియా కూడా ఉడతా భక్తిగా నాలుగు ముక్కలు జోడించి బాష్యం చెపుతుంటుంది. ఇక వైకాపా విషయానికి వస్తే, ఆ పార్టీకి ఒక స్వంత బాకా మీడియా కూడా ఉంది గనుక దానికి మరికొంత రంగులద్ది అందంగా ప్రదర్శిస్తుంది. కానీ పార్టీ నుండి బయటకి పోయేవారి గురించి, వెళ్తూవెళ్తూ వారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పే నాలుగు ముక్కలు గురించీ ఎన్నడూ ప్రస్తావించదు.

 

ఇక విషయంలోకి వస్తే, నాలుగైదు రోజుల క్రితమే వైకాపాకు గుడ్ బై చెప్పేసిన మారప్ప “జగన్మోహన్ రెడ్డికి చాలా అహంకారమని, అతనికి చిన్నపెద్దా లెక్క లేదని, పార్టీలో ఎవరికీ గౌరవం ఉండదని” ఇచ్చిన కితాబు వైకాపాలో చేరాలనుకొనే వారికి ఒక హెచ్చరికగా కనబడుతుంటే, తాజాగా పొట్లూరి వరప్రసాద్ కూడా అవే కారణాలతో వైకాపాలో చేరే ఆలోచన విరమించుకోన్నట్లు మీడియాలో వార్తలు గుప్పుమనడంతో వైకాపాలో కలవరం మొదలయింది. గత నెల రోజులుగా పొట్లూరి వరప్రసాద్ వరప్రసాద్ వైకాపాలో చేరబోతున్నట్లు మీడియాలో బాగానే టాంటాం అయింది. అప్పుడు వైకాపా ఆ వార్తలను ఖండించలేదు కూడా. కానీ, నెల తిరక్కుండానే ఆయన ఇంకా పార్టీలో చేరకముందే, జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక వైకాపాలో చేరే ఆలోచనను విరమించుకొంటున్నట్లు మీడియాలో వస్తున్నవార్తలు చూసి వైకాపా వెంటనే దిద్దుబాటు చర్యలు చెప్పటింది.

 

వైకాపా నరసాపురం లోక్ సభ అభ్యర్ది మరియు ఆ నియోజకవర్గ కన్వీనర్ అయిన రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ, “అసలు పొట్లూరి వైకాపాలో చేరుతున్నట్లు ప్రచారం చేసింది మీడియానే. మళ్ళీ ఇప్పుడు చేరడం లేదని ప్రచారం చేస్తున్నదీ ఆ మీడియానే. అసలు పొట్లూరి వైకాపాలో చేరబోతున్నట్లు పార్టీలో ఎవరూ ఎన్నడూ నిర్దారించలేదు. వైకాపాను, మా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికే చంద్రబాబు ఈ మైండ్ గేమ్ వెనుకుండి నడిపించారు. పొట్లూరికి మా పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదు,” అని అన్నారు.

 

గతంలో కాంగ్రెస్ యంపీ సబ్బం హరి కూడా వైకాపా తరపునే మాట్లాడేవారు. కానీ, ఆయన మరి కొద్ది రోజులలో వైకాపాలో చేరబోతున్నసమయంలో “వచ్చే ఎన్నికల తరువాత తమ పార్టీ (వైకాపా) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని వైకాపా తరపున హామీ ఈయడంతో జగన్మోహన్ రెడ్డి కంగుతిన్నారు. వెంటనే ఆ పార్టీ నేతలు “సబ్బం హరితో కానీ, ఆయన చేసిన ప్రకటనతో గానీ తమ పార్టీకి ఎటువంటి సంబంధమూలేదని, అసలు ఆయన మా పార్టీ సభ్యుడే కాదని” ఆయన మొహం మీదనే తలుపులేసారు. ఇప్పుడు పొట్లూరి విషయంలో కూడా వైకాపా ఇంచుమించు అదేవిధంగా మాట్లాతోంది. కాకపోతే, ఈసారి తమ సమస్యని (అతి)తెలివిగా చంద్రబాబు మెడకి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానయితే పొట్లూరి వరప్రసాద్ కి వైకాపా టికెట్ గురించి మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నప్పుడు ఖండించని వైకాపా, ఇప్పుడు ఖండించడం, దానిని చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నం చేయడం చూస్తే వైకాపా అతితెలివి ప్రదర్శిస్తోందని అర్ధమవుతోంది.