జీవితమనే తుపానులో భయమెందుకు?

ఆ అమ్మాయిది అందమైన మనసు. ఆ అబ్బాయిది వెనుదిరకని వ్యక్తిత్వం. వాళ్లిద్దిరికీ మధ్య ప్రేమ చిగురించింది. అదో అందమైన ప్రేమకథ! ఆ ప్రేమకి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఆ కథ సుఖాంతం అయ్యింది. పెళ్లయిన కొత్తజంత విహారయాత్రకి బయల్దేరారు. దారిలో నది అడ్డువస్తే, దానిని దాటేందుకు చిన్న నావని తీసుకుని వెళ్లారు. నావ నది మధ్యకి రాగానే అప్పటిదాకా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం కాస్తా భీకరంగా మారిపోయింది. సన్నటి చినుకులతో మొదలై పెనుతుపాను చెలరేగింది. అంతటి తుపానుకి నావ అల్లల్లాడిపోవడం మొదలుపెట్టింది. ఎటు చూసినా కారుమబ్బులు, అన్ని వైపుల నుంచీ సూదుల్లా పొడుస్తున్న చినుకులు. వాటిని చూసి యువతి చిగురుటాకులా వణికిపోయింది. కానీ యువకుడిలో మాత్రం ఎలాంటి కలవరమూ లేదు. పైగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడేమో అన్నంతగా అతని మోములో చిరునవ్వు చెక్కుచెదరడం లేదు.

 

యువకునిలోని నిశ్చలత్వం చూసి అతని ప్రేయసికి ఒళ్లుమండిపోయింది. ‘ఇంత ప్రమాదంలో కూడా ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా! బెల్లం కొట్టినరాయిలా కదలకుండా కూర్చుండిపోతావేంటి?’ అంటూ అతన్ని నిందించడం మొదలుపెట్టింది. ప్రేయసి మాటలు విన్న ప్రియుడు ఒక్క ఉదుటున తన ఒరలోంచి కత్తి తీసి ఆమె గొంతు మీద పెట్టాడు. ‘నా చేతిలో ఇంత పదునైన కత్తి నీ గొంతు మీద ఉంటే... నీకు భయం వేస్తోందా!’ అని అడిగాడు. దానికి ప్రియురాలు ‘ఇన్నిరోజులుగా నిన్ను చూస్తున్నాను. నీ స్వభావం ఏమిటో నాకు తెలియదా! చూస్తూ చూస్తూ నా గొంతు కోస్తావని ఎలా అనుకుంటాను. నీ చేతిలో ఎంత ప్రమాదకరమైన ఆయుధం ఉన్నా సరే. అది నా గొంతు మీద ఉన్నా సరే. నువ్వు మాత్రం నాకు హాని తలపెట్టవనే నమ్మకం నాకుంది,’ అంది.

 

‘ఈ తుపాను కూడా ఆ భగవంతుని చేతిలో ఆయుధంలాంటిదే. ఆయన నాకు హాని తలపెట్టడనే నా నమ్మకం. ఒకవేళ నిజంగానే మన ఆయుర్దాయం ఇంతటితో సరి అని ఆయన తలిస్తే మాత్రం, ఇప్పుడు మనమేం చేయగలం! మన నావ నది మధ్యలో ఉంది. మన ఇద్దరికీ ఈత రాదు. చుట్టూ ఆదుకునే వారు లేరు. ఈ ఆపద నుంచి ఎలాగైనా బయటపడితే బాగుండు అని కోరుకుంటూ కూర్చోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి సమయంలో కంగార పడి అటూఇటూ తిరగడం వల్ల నావ కాస్తా బోల్తా పడక మానదు. అందుకని ప్రశాంతంగా కూర్చోవడాన్ని మించి తెలివైన పని మరొకటి ఉందంటావా?’ అని అడిగాడు ఆ యువకుడు. ఆ మాటలకి అతని ప్రియురాలి వద్ద సమాధానం లేకపోయింది.

 

కాసేపటికి తుపాను ఆగిపోయిన. దంపతులు ఇద్దరూ హాయిగా ఆవలి తీరానికి చేరుకున్నారు. కానీ ఆ వీరుడు చెప్పిన మాటలని మాత్రం ఆ యువతి ఎప్పటికీ మర్చిపోలేదు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడేందుకు చేయగలిగిన ప్రయత్నం చేయడం, ఫలితాన్ని ఆ ప్రకృతి మీద వదిలి నిబ్బరంగా ముందుకు సాగిపోవడం! ఆనాడు తన వీరుడు చెప్పిన ఈ సూత్రాన్ని జీవితాంతమూ ఆ యువతి మర్చిపోలేదు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.