కాంగ్రెస్ మార్క్ రాజకీయం.. ఖమ్మం ఎంపీగా పొంగులేటి!!

 

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఖమ్మం లోక్ సభ స్థానం చుట్టూ తిరుగుతున్నాయి. ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చేదు ఫలితం ఎదురైంది. మొత్తం పది స్థానాలకు గాను ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీటుని ఎలాగైనా గెలుచుకొని సత్తా చాటాలనుకుంటుంది. అందుకే ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది.

2014 లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి తరువాత టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేతతో పాటు కేటీఆర్‌తోనూ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. అయితే జిల్లాలో ఏర్పడిన గ్రూప్ రాజకీయాలే ఇప్పుడు ఆయన టికెట్ కి పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీలో ఏర్పడిన విభేదాలే ఖమ్మం జిల్లాలో చేదు ఫలితానికి కారణమని కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెప్పారు. మరోవైపు ఎంపీ పొంగులేటి వల్లే తాము ఓటమి పాలయ్యామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు, మదన్ లాల్, పిడమర్తి రవి, తాటి వెంకటేశ్వర్లు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పొంగులేటికి ఎంపీ టికెట్ ఇస్తే తాము పని చేయమని జిల్లా టీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌తో చెప్పినట్టు సమాచారం. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సైతం ప్రత్యామ్నాయ అభ్యర్థిగా వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేరును సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ అభ్యర్ధిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్ రిపీట్ చేయాలనుకుంటుంది. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలోనే కాస్త గందరగోళం ఏర్పడింది. ఎవరి పేరు ప్రకటిస్తే ఎవరి వర్గం గోల చేస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ కి పొంగులేటి రూపంలో అదృష్టం కలిసొచ్చింది. పొంగులేటిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోందట. కొందరు నేతలు సైతం టీపీసీసీకి పొంగులేటి పేరు సూచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సిట్టింగ్ అభ్య‌ర్థికి అవ‌కాశం ఇస్తే గెలుపుపై ధీమాగా ఉండొచ్చ‌నేది కాంగ్రెస్ నేత‌ల అంచ‌నాగా తెలుస్తోంది. పొంగులేటి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నట్టు స‌మాచారం. నిజంగా కాంగ్రెస్ పొంగులేటిని బరిలోకి దింపితే ఖమ్మంలో టీఆర్ఎస్ కి గట్టి షాక్ అనే చెప్పాలి.