రచ్చకెక్కుతున్న రిజర్వేషన్లు....

బడుగు, బలహీన వర్గాలు, దళితులు గిరిపుత్రుల ఆర్ధిక, సామాజిక ఎదుగుదల కోసం దేశంలో రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించారు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. నిమ్న కులాలను, వారు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా అనుభవించిన అంబేద్కర్... వీటికి పరిష్కారం రిజర్వేషన్ల కల్పనే అని నిర్ధారించారు. అందుకే భారత రాజ్యంగంలో ఈ రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరిచారు. దేశంలో అన్నీ రాష్ట్రాలలోను ఆయా కులాల జనాభాన్ని బట్టి రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించారు. దేశంలో ఉద్యోగ, విద్య రంగాలలో ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని నిబంధనలు విధించారు. ఈ రిజర్వేషన్ల వల్ల దేశంలో దళితులు, గిరిజనులు,  బడుగు బలహీన వర్గాల వారు అన్ని విధాల పైకి రావాలని ఆనాడు అంబేద్కర్ భావించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకూ ఈ రిజర్వేషన్ల అమలు పటిష్టంగానే జరిగింది. ఒకటి రెండు సార్లు పొరపాట్లు జరిగినా అవి పెద్దగా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు.

 

 

దేశంలో నానాటికి మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఆర్ధిక అవసరాల నిమిత్తం కొన్ని కులాలు ఈ రిజర్వేషన్లను తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయ్. ఈ డిమాండ్ దేశంలో అలా... అలా అన్ని రాష్ట్రాలకు,  అనేక కులాలకు పాకింది. ఉత్తారాది అని లేదు, దక్షిణాది అని లేదు...... ఈ రాష్ట్రం అని, ఆ రాష్ట్రం అని లేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను అనేక కులాలలోను ఈ రిజర్వేషన్ల చిచ్చు దావానంలా చుట్టేసింది. ఓ తుపానులా చుట్టుముట్టింది. ఈ రిజర్వేషన్ల రావణకాష్టం నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం దేశంలో ఆర్ధిక అసమానతలు నానాటికి పెరుగుతున్నాయి. డబ్బున్న వారు మరింత ఆస్తి పరులవుతున్నారు. నిరుపేదలు నానాటికి దిగజారుతున్నారు. ఈ ఆర్ధిక వ్యత్యాసంతో వివిధ కులాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి ఏకైక సంజీవిని రిజర్వేషన్లే అని ఆయా కులాల వారు నిశ్చయానికి వచ్చేసారు.

 

 

మహారాష్ట్రలో మరాఠాలు విద్య,  ఉపాధి రంగాలలో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలంటూ రోడ్డెక్కారు. ఇది నానాటికి పెరుగుతోంది. ఇంతవరకూ కులాలకు మాత్రమే పరిమితమైన ఈ రిజర్వేషన్ ప్రక్రియ మరాఠాల ఉద్యమంతో కొత్త రూపు సంతరించుకుంది. కులాలకు మాత్రమే ఇన్నాళ్లూ పరిమితమైన రిజర్వేషన్లు ఇప్పుడు ప్రాంతాలకూ, వర్గాలకూ కూడా పాకడం శోచనీయం. మరాఠాలు, తమకు అన్నీ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది సహేతుకం కాని డిమాండ్ అని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో గడచిన కొన్ని రోజులుగా మహారాష్ట్ర అట్టుడుకుతోంది. వేలాదిమంది మరాఠీలు తమ డిమాండ్ సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఇది కాస్తా భగ్గుమంది. మహారాష్ట్రలోని పూణే, నాసిక్‌లతో పాటు అనేక చోట్ల మరాఠాలు ఉన్న చోట విధ్వంసం చెలరేగుతోంది. ఆత్మహత్యలకూ పాల్పడుతున్న  వైనం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్యమానికి రాజకీయ ప్రయోజనాలు ఆశించే వివిధ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఇదీ ఏమంత మంచిది కాదు. ఇలా ప్రాంతాల వారీగా రిజర్వేషన్లంటే దేశంలో అన్నీ రాష్ట్రాలలోను ఇలాంటి ఆందోళనలు ప్రారంభమవుతాయి.

 

 

తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోను ఈ రిజర్వేషన్ల సెగ రాజుకుంది. కాపు కులస్థులకు రిజర్వేషన్లు ఇవ్వడంపై రాజకీయ పార్టీలు పిల్లిమొగ్గలు వేస్తున్నాయ్. ఇంతకు ముందు కాపులకు రిజర్వేషన్లపై సంసిద్ధత వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా యూటర్న్ తీసుకుంది. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోనివని,  తాను రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహాన రెడ్డి ప్రకటించారు. దీంతో ఆయన సెల్ఫ్ గోల్ చేసారని అధికారపక్షం ఆనంద పడుతోంది. కాపులు మాత్రం జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇలా దేశంలో రిజర్వేషన్ల అంశంపై ప్రతీ రాష్ట్రంలోనూ, దేశంలో ఏదో ఒక మూల వివాదం చెలరేగుతూనే ఉంది.

 

 

ప్రతి కులాన్ని ఓటర్లుగా మాత్రమే పరిగణించే రాజకీయ పార్టీలు ఆ వైఖరి విడనాడాలి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల్లో విజయం కోసం అసాధ్యమైన హామీలను ఇస్తే ప్రజలలో ఓ గందరగోళం ఏర్పడుతుంది. దీన్ని నివారించటానికి రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలి. రిజర్వేషన్లపై రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని,  అడ్డూ అదుపు లేని హామీలు ఇవ్వడం అంత మంచిది కాదు. దీనిపై ప్రతి రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. రిజర్వేషన్లంటే పేదల అభ్యున్నతికి,  బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల అభ్యున్నతికి ఉపయోగపడేవే తప్ప... ఓట్లు రాల్చేవి కావని గ్రహించాలి. అప్పుడే దేశంలో ఈ రిజర్వేషన్లపై అనవసరపు గందరగోళానికి తెర పడుతుంది.