ఆశ్చర్యపోయే తీర్పు ఖాయం: రఘువీరా రెడ్డి

 

మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో బహుశః కాంగ్రెస్ వారిని మించినవారు మరొకరు ఉండరేమో! పార్టీ ఇచ్చిన టికెట్లను కూడా విసిరికొట్టి, అభ్యర్ధులు వేరే పార్టీలలోకి మారిపోయినా కూడా, తమ పార్టీ టికెట్స్ కోసం విపరీతమయిన పోటీ ఉందని, సీమాంధ్రాలో ఉన్న 175 స్థానాలకు ఏకంగా 2000 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పుకొన్నారు. అంతేకాక ఈ ఎన్నికలలో ప్రజలు కనీవినీ ఎరుగనిరీతిలో కాంగ్రెస్ అనుకూలమయిన తీర్పు ఇవ్వబోతున్నారు. అది ఏవిధంగా ఉంటుందంటే, అది 1978 నాటి రికార్డు తిరగవ్రాయబోతోంది అని చెప్పారు. ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలన్నీ కనబడకుండా మాయమయిపోతాయని జోస్యం చెప్పారు. సమైక్యాంధ్ర పేరిట పార్టీని పెట్టి, నేటికీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రజలను మభ్యపెడుతున్న కిరణ్ కుమార్ రెడ్డే రాష్ట్ర విభజనకు అసలు కారకుడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చిరకాలంగా పనిచేస్తున్న రఘువీరా రెడ్డి, ఆ విధంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో అసహజమూ లేదు. అయితే ఆయన చెప్పిన మాటలలో కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పిన దాంట్లో నూటికి నూరు శాతం నిజముందని అంగీకరించవచ్చును.