మోడీ ఆఫ్ ద ఇయర్... 2019 నేషనల్ పొలిటికల్ రిపోర్ట్...

రాజకీయ సంచలనాలకు కూడా 2019 వేదికైంది. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న మొదలైన సార్వత్రిక ఎన్నికలు... మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ టార్గెట్ ప్రకారం 300 ప్లస్ సీట్లను సాధించింది. గతంలో కంటే 21 స్థానాలను అదనంగా మొత్తం 303 స్థానాల్లో గెలుపొందింది, దాంతో, మే 30న మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఇక, కాంగ్రెస్ మరోసారి ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 52 స్థానాలకే పరిమితమైంది. దేశవ్యాప్తంగా బీజేపీ 37.36 శాతం ఓట్లను సాధించగా, కాంగ్రెస్ 19.01 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. మొత్తం మీద బీజేపీ కూటమి 353 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్ కూటమి 91 సీట్లలో విజయం సాధించింది. ఇతరులు 98 సీట్లలో నెగ్గారు. ఇక, కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఇక, 2019లోనే ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతోపాటే ఏపీ, అరుణాచల్, సిక్కిం, ఒడిషాకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో వైసీపీ... అరుణాచల్ లో బీజేపీ... సిక్కింలో బీజేపీ మిత్రపక్షాలు... ఒడిషాలో నవీన్ పట్నాయక్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానాకు ఎన్నికలు జరగగా... మహారాష్ట్రలో రాజకీయాలు అనేక మలుపు తిరిగాయి. చివరికి, కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన అధికారం చేపట్టింది. ఇక, హర్యానాలో హంగ్ ఫలితాలు వచ్చినప్పటికీ... బీజేపీనే అధికారం దక్కించుకుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో 2019 రాజకీయాలు ముగిశాయి. 2019 చివర్లో జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో జేఎఎం ఘనవిజయం సాధించడం హేమంత్ సోరెన్  రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.

అయితే, 2019 అనేక రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టగా... ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ... 50శాతం ఓట్లు, 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు దేశ దృష్టిని ఆకర్షించాయి. బీజేపీ, శివసేన గొడవలతో మహా పాలిటిక్స్ అనేక మలుపులు తిరిగాయి. అధికారం కోసం రెండు పార్టీలూ కొత్త దారులు వెతుక్కున్నాయి. చివరికి కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన అధికారం దక్కించుకుంది. ఇక, కర్నాటక రాజకీయాలు కూడా రసవత్తరంగా సాగాయి. సరికొత్త నెంబర్ గేమ్ తో కర్నాటకలో అధికారాన్ని బీజేపీ దక్కించుకుంది. మొత్తానికి అనేక కొత్త రాజకీయాలకు సంచలనాలకు 2019 వేదికైంది.