కత్తులు దూస్తున్న పొత్తులు

 

కాలం కలిసొస్తే .. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఐదేళ్ళకోసారి నిర్వహించే పెజాస్వామ్య కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుద్ది. పరస్పరం కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులతో రంగంలోకి దిగుతాయి. చేతిలో చెయ్యేసి కలిసి సాగిన వేర్వేరు పార్టీల నేతలు సై అంటే సై అంటూ ఈవీఎమ్ ఫైట్ కు సిద్ధమవుతారు. గెలుపే పరమావధి.. అధికారమే లక్ష్యంగా పొత్తులు కుదురుతాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక ప్రకటనతో ఓటర్లను ఓడార్చుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కాకపొతే పొత్తులు తతంగం ఇప్పటికే పూర్తయ్యేది. విభజనే ఎన్నికల అస్త్రంగా కాంగ్రెస్ ప్రయోగించేసరికి పొలిటికల్ సీను ఒక్కసారిగా మారిపోయింది.

 

ఎన్నికలకు ముందు ఏదో ఒక పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరిగే లెఫ్ట్ పార్టీలు .. లెఫ్ట్... రైట్ అంటూ చెరో దారి చూసుకుంటున్నాయి. తెలంగాణా ఏర్పాటుకు మద్దతు పలికిన సీపీఐ, సమైక్యాంధ్ర నినాదంతో ఉన్న సీపిఎం చెరో దారి వెతుకుంటున్నాయి. అవినీతిపై అలుపెరగని పోరాటం చేసిన సీపీఎం ..కోట్లలో అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారని కామ్రేడ్స్ గుసగుసలాడు కుంటున్నాయి.

 

సీపీఐకి సీపిఎం హ్యాండ్ ఇవ్వడంతో కొత్త మిత్రులను వెతికే పనిలో పడింది నారాయణ గ్యాంగ్. తెలుగుదేశంతో వెళ్తే తెలంగాణలో నష్టపోయే పరిస్థితి. ఒంటరినైపోయాను ఇక ఎన్నికలకు ఎలాగు పోను అంటూ పాత పాటను కొత్తగా పాడుకుంటున్నారు కామ్రేడ్లు. తెలంగాణా తెచ్చామని మాంచి జోష్ లో ఉన్న తెరాస దయ తలిస్తే సీపీఐకి కొత్త మిత్రుడు దొరికినట్టే. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పార్టీగా గుర్తించి కాంగ్రెస్ స్నేహ హస్తం అందిస్తే తెలంగాణలో పోటీకి కొంత మద్దతు లభించవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 

ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు వారితో కలిసి సాగిన బాబు 2004 ఎన్నికల నుంచి కమలనాధులతో కలహం ప్రారంభమైంది. విభజన బిల్లు పార్లమెంటుకు చేరిన సమయంలో మళ్ళీ మొగ్గ తొడుగుతుందనుకున్న మైత్రి అంతలోనే అంతమైంది. ఉభయ సభల్లో పాలక, ప్రతిపక్షాలు ఒక్కటై బిల్లును గట్టేక్కించాయి. దీంతో భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు ప్రతిపాదన చిత్తయ్యింది.

 

తెలంగాణలో తమతో గులాబీ పార్టీ కలిసి వస్తుందని ఆశతో ఉన్న కాంగ్రెస్ నేతలకు గుబులు పుట్టించారు కేసీయార్. సీమాన్ధ్రలో పూర్తిగా మునిగిపోయిన కాంగ్రెస్ కారు ఎక్కి తెలంగాణలో షికారు చేద్దామని ఊహల్లో తేలిపోయింది. షికారుకు కారు ఇవ్వనని తెగేసి చెప్పి.. కనీసం లిఫ్ట్ కూడా ఇవ్వనని తేల్చేసారు పెద్ద సారు. కమిటీ చేతిలో పొత్తుల స్టీరింగ్ ఉంది. తమతో కలవాలనుకునేవారు.. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకునేవారు వారిని కలవండి అంటూ డోర్ లాక్ చేశారు దొర గారు.

 

చేతుల కాలాక పొత్తులు పెట్టుకుని ఏమి లాభం అనుకుని ఒంటరి పోటీకి సిద్ధం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రస్తుత పరిస్తితుల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ధైర్యం ఏ పార్టీ చేయదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. తెలంగాణా తెచ్చామని ఇక్కడ.. ప్యాకేజి ఇచ్చామని అక్కడ.. నినాదాలతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

 

పొత్తులు ఎత్తులు విఫలమవడంతో.. పార్టీలు కత్తులు దూస్తున్నాయ్. నిన్నటి మిత్రులు శత్రువులై పోతున్నారు. విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ మోసం చేసిందని కెసిఆర్ అంటే . కెసిఆర్ పిట్టలదొర అని షబ్బీర్ అలీ విరుచుకుపడుతున్నారు. సిపిఎంపై నారాయణ ఒంటి కాలిపై లేస్తున్నారు. కాంగ్రెస్ తో బీజేపి కుమ్మక్కు అయిందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుంటే ... వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డిలు టీడీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎ

 

న్నికలు దగ్గర పడేసరికి..పొత్తులు కుదిరితే .. ఈ తిట్లు.. శాపనార్ధాలు..పొగడ్తలు .. ప్రశంసలుగా మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.