కాంగ్రెస్ కు సింహ స్వప్నంగా మారిన మోడీ

 

ఒక వైపు కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముహూర్తం ఖాయం అయిపోవడం, మరో వైపు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంటరీ బోర్డులోకి మళ్ళీ తీసుకోవడానికి బాజపా సిద్ధం అవడంతో కలవరపడుతున్న కాంగ్రెస్ పార్టీ, తన యువనాయకుడయినా రాహుల్ గాంధీకి పెనుసవాలుగా మారనున్న నరేంద్ర మోడీ మీదకు తనకు బాగా అలవాటయిన చవకబారు అస్త్రాన్ని సందించి ఆయనను అప్రదిష్టపాలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది.


ఇటీవల అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు గుజరాత్‌ వచ్చి మోడీని కలవడం, ఆయనను ప్రశంసలతో ముంచెత్తడం, ఆయనను అమెరికా రమ్మని వారు ఆహ్వానించడం చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ, వారి పర్యటనకు పరోక్షంగా బీజేపీయే డబ్బు అందించడమే కాకుండా, నరేంద్రమోడీని కలిసినందుకు కొన్ని బహుమతులు కూడా అందజేసిందని ఆరోపించింది. . చికాగో కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌ ఇండియన్‌ అమెరికన్‌ పబ్లిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ ఈ ట్రిప్‌ను స్పాన్సర్ చేయగా, దానికి అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్తలు మరియు ఇతరులు కలిసి అవసరమయిన సొమ్ము సమకూర్చారని బాజపా విదేశీ వ్యవహారాల శాఖ కన్వీనర్ విజయ్ జోలీ మీడియాకు తెలిపారు.

 

అమెరికాలో ప్రతీ పనికి కొంత మూల్యం చెల్లించడం తప్పనిసరి అని, చివరికి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కలిసి కూర్చొని సరదాగా భోజనం చేయలన్నాకూడా దానికి అక్కడ డబ్బు వసూలు చేయడం సర్వసాదారణ విషయమని, అటువంటప్పుడు 18మంది అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు, వ్యాపారవేత్తలు కలిసి భారత్ పర్యటనకు రావడానికి కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదని, దానిని అమెరికాలో స్థిరపడిన కొందరు భారతీయులు భరించారు తప్ప, నరేంద్ర మోడీ కానీ, గుజరాత్ ప్రభుత్వం గానీ భరించలేదని అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమిటి అభ్యంతరం అని ఆయన ప్రశ్నించారు.

 

అమెరికా నుండి వచ్చిన 18 మంది సభ్యులలో కేవలం ముగ్గురు కాంగ్రెస్‌ సభ్యులు ఆరన్‌ షాక్‌, సింథియా ల్యూమిస్‌, కాథే ఎం రోడ్జర్స్‌ మాత్రమే గుజరాత్ వెళ్లి మోడీని కలువగా మిగిలిన వారు దేశంలోని వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్నారని, వాటిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నందున కాంగ్రెస్ కూడా వారి పర్యటనకు డబ్బు ఖర్చు చేస్తోందని భావించాలా? అని ఆయన ప్రశ్నించారు. భారత్ తో అమెరికా వ్యాపార సంబందాలు మరింత మెరుగుపడాలనే సదుదేశ్యంతో పంజాభీ ఎన్నారై సలభ్ సింగ్ నేతృత్వంలో నేషనల్‌ ఇండియన్‌ అమెరికన్‌ పబ్లిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ తీవ్ర ప్రయత్నాలు చేసి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను, వ్యాపారవేత్తలను భారత పర్యటనకు ఒప్పించి, తాము ప్రోగు చేసిన విరాళాలతో వారిని భారత్ కు పంపిస్తే, దానిని స్వాగతించకపోగా కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా రాజకీయం చేయడం హేయమయిన పని అని బాజపా విదేశీ వ్యవహారాల శాఖ కన్వీనర్ విజయ్ జోలీ అన్నారు.

 

నేటికీ ‘సోనియా గాంధీ అల్లుడు’ అనే ఏకైక హోదాతో రాబర్ట్ వాద్రా యావత్ ఖర్చులను భారతప్రభుత్వం భరిస్తున్నప్పటికీ సిగ్గుపడని కాంగ్రెస్ పార్టీ, అమెరికాలో స్థిరపడినప్పటికీ భారత్ ప్రయోజనాల కోసం కృషిచేస్తున్నభారతీయులను అభినందించకపోగా, వారి కృషిని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం చాల హేయమయిన పని అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

 

ఇక, నరేంద్ర మోడీని ఓ ముగ్గురు అమెరికా దేశస్తులు పొగిడి, ఆయనను తమ దేశం రమ్మని ఆహ్వానిస్తే దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతగా భయపడిపోవడం చూస్తే నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీకి సింహస్వప్నంలా మారారని అర్ధం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని కొల్పోయినందునే ఇప్పుడు ఆ పార్టీకి ‘నరేంద్రమోడీ విశ్వరూపం’లో దర్శనమిస్తున్నారని భావించవచ్చును.

 

నరేంద్ర మోడీ తను సాధించిన విజయాలతో ముందుకు వెళ్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఈ 5 సం.లలో అనేక కుంభకోణాలు తప్ప సాధించిన ఘనకార్యం ఏమి లేనందున, ఎదుటవారి లోపాలనే తన ఆయుదాలుగా చేసుకొని యుద్దానికి బయలుదేరుతోంది. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు మోడీపై ఈ బురద జల్లుడు కార్యక్రమానికి పూనుకొందని చెప్పవచ్చును. అయితే, ఇటువంటి ఆయుధాలతో యుద్ధంలో విజయం సాదించడం అసంభవమని కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ ఎన్నికలలో బాగా అర్ధం అయింది. కానీ, ఆ పార్టీకి ఇంత కంటే మరో దారి లేనందునే ఈ విధంగా దాడి చేస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ దయనీయమయిన పరిస్థితికి అద్దం పడుతోంది.