రాజకీయ అరంగ్రేటం చేయబోతున్న నేతల వారసులు...

రాజకీయాలు అంటేనే వారసుల విషయంలో చాలా పెద్ద స్థానం ఉంటుంది. తమ ఆస్తులను వారసులకు ఇస్తారో లేదో తెలియదు కానీ పొలిటికల్ కెరీర్ ను మాత్రం పది కాలాల పాటు భద్రంగా ఉంచుకోవటానికి నేతలు వారసులను రంగంలోకి దింపుతుంటారు . ఈ నేపధ్యంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వారసుల అరంగేట్రానికి ప్లాట్ ఫాంగా మారాయి. అన్ని జిల్లా ల్లోనూ రాజకీయ వారసులు బరిలో ఉన్నారు. కింది స్థాయి నుంచి పెద్ద నేతగా ఎదగటానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు రాజకీయ వారసులు. తమ పొలిటికల్ కెరీర్ పునాది గట్టిగా వేసుకోవటానికి మున్సిపల్ ఎన్నికలను వేదికగా మార్చుకున్నారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను రాజకీయ వారసులు బరిలోకి దిగుతున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కుటుంబం బరిలోకి దిగింది. ఆయన కోడలు లావణ్యను 39 వ డివిజన్ నుంచి పోటీకి దింపారు. గతంలో సోమారపు సత్యనారాయణ గోదావరిఖని మున్సిపల్ ఛైర్మన్ గా రామగుండం ఎమ్మెల్యేగా పని చేశారు. ఇప్పుడు తన కుటుంబం నుంచి కోడలిని బరిలోకి దించగా.. ఇక పెద్దపల్లి మున్సిపాలిటీ నుంచి స్థానిక ఎమ్మెల్యే తన కోడలిని బరిలోకి దించారు. ఇరవై ఒకటో వార్డు నుంచి మమతారెడ్డి పోటీలో నిలిచారు. అయితే ఆమెతోపాటూ ఐదుగురు పోటీకి నామినేషన్ లు దాఖలు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారి నామినేషన్ లను ఉపసంహరించుకునేలా పావులు కదపడంతో దాసరి మమతారెడ్డి ఏకగ్రీవంగా గెలిచారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల్లో తన మార్క్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. తన అక్క కోడలిని కరీంనగర్ మున్సిపాలిటీ 46 డివిజన్ నుంచి బరిలోకి దించుతున్నారు. గతంలోనూ ఆమె ఈ డివిజన్ నుంచి గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలో మరి కొందరు జడ్పీటీసీ, ఎంపీటీసీలు మున్సిపల్ వార్డు మెంబర్ల వారసులు కూడా బరిలో నిలవడం విశేషం.మొత్తానికి నేతలు తమ వారసులను బరిలోకి దింపే పనిలో పడ్డట్టు సమాచారం.