వేడెక్కిన నెల్లూరు వైసీపీ రాజకీయం.. నష్టం తప్పదా?

 

నెల్లూరులో వైసీపీ పరిస్థితి 'ముందు నుయ్యి, వెనుక గొయ్యి'లా తయారైంది.. నెల్లూరులో ఇద్దరు సీనియర్ నాయకులు వైసీపీలో చేరటానికి సిద్ధమయ్యారు.. ఇంకేంటి వైసీపీ హ్యాపీగా అంటారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఆ ఇద్దరు నేతల మధ్య తరతరాలుగా వైరం ఉంది.. దానివల్ల జిల్లాలో పార్టీకి నష్టం జరిగేలా ఉంది.. పోనీ ఆ ఇద్దరినీ పార్టీలో చేర్చుకోకుండా ఉందామా అంటే అది మొదటికే మోసం.. ఈ కన్ ఫ్యూజన్ తోనే వైసీపీ బుర్ర వేడెక్కుతుంది.. ఇప్పుడే ఇలా ఉందంటే ఆ ఇద్దరు నేతలు చేరితే వైసీపీ రాజకీయం ఏ రేంజ్ లో వేడెక్కుతుందో ఏంటో.. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరంటే.. ఒకరు ఆనం రామనారాయణ రెడ్డి, మరొకరు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి.

 

 

ఆనం సెప్టెంబర్ 2 న, నేదురుమల్లి సెప్టెంబర్ 8 న వైసీపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.. అయితే వీరి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఎప్పటినుండో ఉంది.. అయితే ఇప్పుడు అది వైసీపీకి శాపంగా మారుతుందా అని ఆ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి.. ఈ రెండు కుటుంబాలు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగాయి.. నేదురుమల్లి జనార్ధన రెడ్డి టీచర్ స్థాయి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసారు.. ఆనం కుటుంబం కూడా సుమారు ఐదు దశాబ్దాలు నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పింది.. నేదురుమల్లి జనార్ధన రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డితో రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండేవి.. మరోవైపు ఆనం కుటుంబం మాత్రం వైఎస్ కు సన్నిహితంగా ఉండేది.. దీంతో నేదురుమల్లి, ఆనం కుటుంబాల మధ్య నువ్వా నేనా తేల్చుకోవాలి అన్నట్టుగా విభేదాలు కొనసాగేవి.. జనార్ధన రెడ్డి మరణించేవరకు ఈ రెండు కుటుంబాల మధ్య వైరం కొనసాగింది.. దశాబ్దం తరువాత ప్రస్తుత రాజకీయాల్లో నాటి విభేదాలు మరోసారి తెరపైకి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.

 

 

గతంలో ఆనం రామనారాయణ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.. రాష్ట్ర విభజన అనంతరం ఆనం టీడీపీలో చేరారు, నేదురుమల్లి బీజేపీలో చేరారు.. అయితే ఇప్పుడు ఈ నేతలు వైసీపీలో చేరటానికి సిద్ధమయ్యారు.. చేరటం వరకు ఓకే కానీ తరువాతే పెద్ద చిక్కొచ్చేలా ఉంది పార్టీకి.. ఆత్మకూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి పోటీ చేయటానికి ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఆనం వెంకటగిరి వైపు చూస్తున్నారు.. మరోవైపు నేదురుమల్లి కూడా వెంకటగిరి టిక్కెట్ ఆశిస్తూనే వైసీపీలో చేరుతున్నారట.. ఇద్దరి కన్ను ఒకే సీట్ మీద పడటంతో తరతరాలుగా ఉన్న కుటుంబ వైరం మళ్ళీ తెరమీదకు వస్తుందా? అంటూ వారు ఇంకా పార్టీలో చేరకముందే వైసీపీలో టెన్షన్ మొదలైంది.. చూద్దాం మరి వైసీపీ నెల్లూరు రాజకీయం ఏమవుతుందో ఏంటో.