సినీ నటి భానుప్రియను పోలీసులు అరెస్ట్ చేయనున్నారా..?

 

నటి భానుప్రియను పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో భాను ప్రియపై బాల కార్మికుల నేరం నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి ఫిర్యాదు చెన్నైలో నమోదవడంతో కేసును చెన్నైకి బదిలీ చేశారు పోలీసులు. పోస్టులో వచ్చిన ఎఫ్.ఐ.ఆర్ కాపీ ఆధారంగా భాను ప్రియపై 323 506 341 సెక్షన్ లతో పాటు  75, 79 జువనైల్ యాక్ట్ కింద కేసులు పెట్టారు పాండిబజార్ పోలీసులు.

చెన్నైలో ఉంటున్న భానుప్రియ మెడకు పోలీసు కేసు చుట్టుకుంటోంది. గత జనవరి 19న తన ఇంట్లో పని చేసే అమ్మాయి దొంగతనం చేసిందంటూ సోదరుడు గోపీ కృష్ణతో కలిసి పాండిబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పనిపిల్ల తల్లి ప్రభావతి గతంలోనే సామర్లకోట పోలీసులకు భానుప్రియపై ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని ఇంట్లో నిర్బంధించి చిత్ర హింసలు పెడుతున్నారని కంప్లైంట్లో పేర్కొంది. తన కూతుర్ని రక్షించమని పని మనిషి తల్లి కోరింది. ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదుతో నటి భాను ప్రియపై బాలకార్మిక నేరం నమోదు చేశారు సామర్లకోట పోలీసులు.

ఈ కేసులో భాగంగానే సామర్లకోట పోలీసులు చెన్నైకి వెళ్లి నటి భాను ప్రియను విచారించారు. అదే సమయంలో భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై పాండిబజార్ పోలీసులు పనిపిల్ల తల్లి ప్రభావతిని అరెస్టు చేసి విచారించారు. గతేడాది నమోదైన కేసును సామర్లకోట పోలీసులు తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన నేరం జరిగింది చెన్నైలో కాబట్టి నటి భాను ప్రియపై బాలకార్మిక చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు అప్పగించారు. దీంతో చెన్నై పాండిబజార్ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ ఆమె సోదరుడు గోపాల కృష్ణన్ పై కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు భానుప్రియను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.