ఎమ్మెల్యే చింతమనేనిపై కిడ్నాప్‌ కేసు

 

ఏపీ టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న దెందులూరు ఎమ్మెల్యే, విప్‌ చింతమనేని ప్రభాకర్‌ నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు.కొన్నిరోజుల క్రితం పోలవరం కాలువ గట్టు మట్టి తవ్వకాల విషయంలో అధికారులపై దౌర్జన్యం కేసులో అతని అనుచరులపై కేసు నమోదవ్వగా తాజాగా మరోసారి అదే వివాదంలో ఓ సర్పంచ్ పై దాడి చేయగా చింతమనేని, అతని అనుచరుడు గద్దేకిషోర్‌, గన్‌మెన్‌ ఏలియాలపై కిడ్నాప్‌, దాడి కేసులు నమోదయ్యాయి.దెందులూరు నియోజకవర్గం గార్లమడుగు మాజీ సర్పంచి మేడికొండ వెంకట సాంబశివ కృష్ణారావును (వైకాపా) కొట్టి గాయపరిచినందుకు ఈ కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ ఈశ్వరరావు తెలిపారు.

భాదితుడి ఫిర్యాదుపై ఏఎస్పీ వివరణ .. "కృష్ణారావు ఏలూరు నుంచి గార్లమడుగు వస్తుండగా వంగూరు-లక్ష్మీపురం మధ్య కొందరు పోలవరం కుడికాలువ గట్టు మట్టిని యంత్రాలతో తవ్వి టిప్పర్లలో పోస్తుండటం కనిపించింది.ఆయన పోలవరం కుడికాలువ ఎస్‌ఈకి ఫోన్‌ చేయగా.. ఆయన డీఈని పంపిస్తానని అక్కడే ఉండమని చెప్పారు. తర్వాత డీఈ ఫోన్‌ చేసి తాను స్థానికంగా లేనని ఏఈని పంపుతున్నానని తెలిపారు. అదే సమయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అటుగా వచ్చి చూసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేని చూడటంతో కృష్ణారావు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఏఈ ఫోన్‌ చేసి తాను వస్తున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణారావు అక్కడే ఉన్నారు.కాసేపయ్యాక ఎమ్మెల్యే అనుచరులు గద్దేకిషోర్‌ మరికొందరు వచ్చి కృష్ణారావుపై దాడి చేశారు.అతనిని అక్కడి నుంచి కారులో ఎమ్మెల్యే స్వగ్రామం దుగ్గిరాల తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే కూడా దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారని తెలిపారు.అనంతరం అతనిని పెదవేగి పోలీసుస్టేషన్‌ వద్ద విడిచి వెళ్ళిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు".కేసు నమోదు చేసిన అనంతరం బాధితుడికి రక్షణ కల్పించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.