రివర్స్ టెండరింగ్ అంటే ఏంటి ? పోలవరానికి లాభమా ? నష్టమా ?

 

ఆంద్రరాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినవచ్చే మొదటి మాట రివర్స్ టెండరింగ్. ఏపీ ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన కాంట్రాక్టర్ అయిన నవయుగ సంస్థను తొలగించడంతో ఈ చర్చ మరింత ముందుకువచ్చింది. ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ప్రభుత్వ ప్రాజెక్ట్ లను రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా చేపడతామని కొత్త ప్రభుత్వం చెబుతోంది. జ్యుడీషియల్ కమిషన్ యొక్క పర్యవేక్షణలో న్యాయమూర్తులు నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్ ని ఆంద్రప్రదేష్ లో మొదటి రివర్స్ టెండరింగ్ ప్రాజెక్ట్ గా పోలవరం ప్రాజెక్ట్ నిలుస్తోంది. 

బాబు పాలనలో జరిగిన అవకతవకలను అవినీతిని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ పోలవరం ప్రాజెక్ట్ ని తోలి రివర్స్ టెండరింగ్ ప్రాజెక్ట్ గా సూచిస్తూ  తన రిపోర్ట్ ని గత వారం అందించింది. కావాలనే నిర్మాణంలో తాత్సారం చేసినప్పటికీ ఎటువంటి జరిమానా లేకుండా అప్పటి ప్రభుత్వ అనేక సార్లు  వారికి సమయాన్ని పొడిగించినట్టుగా ప్యానెల్ కనుగొంది.

అప్పటి అధికార యంత్రాంగం ఈ తాత్సారానికి జరిగిన నష్టానికి ఎటువంటి జరిమానా కానీ పరిహారం కానీ విధించక పోవడం ప్రభుత్వ యంత్రాంగంలోని సామర్ధ్య లోపంగా ప్యానెల్ పేర్కొంది. కాంట్రాక్ట్ నిభందనలకు అనుగుణంగా ఒప్పందకాల పరిమితులలో కాంట్రాక్టర్ లకి కేటాయించిన పనులను వారు పూర్తి చేయలేదని నిపుణుల ప్యానెల్ అభిప్రాయపడింది. అంతేకాకుండా వారు కావాలనే పనిని తాత్సారం చేసి అధిక రేట్ల సవరణను డిమాండ్ చేసినట్టు పేర్కొంది.  

మొత్తం ఎనిమిది మంది కాంట్రాక్టర్లు  ఒప్పంద తేదీ నుండి ఇరవై నాలుగు నెలలలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది, కానీ నిర్మాణాలు పూర్తి కాక పోయినా ప్రభుత్వాన్ని నిర్మాణ వ్యయాన్ని పెంచమని కోరడం ప్రభుత్వం అంగీకరించడం ఆ విధంగా కాంట్రాక్టర్ లకి దాదాపు 3800కోట్ల మేర రేట్లు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, తిరిగి టెండర్ చేయడానికి ఒక బిల్లును ఆమోదించింది. 

వంద కోట్ల పైగా వ్యయం అయ్యే ఏవైనా పెద్ద ప్రాజెక్టులలో అవినీతి అవకతవకలు  ధర పెరుగుదల కనిపిస్తే వాటిని తాజా బిడ్డింగ్ ద్వారా రివర్స్  టెండరింగ్ నిర్వహించాలని భావిస్తూ పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. ప్రభుత్వం  రివర్స్ టెండరింగ్ ద్వారా మరొక్కసారి బిడ్డింగ్ కి వెళ్లి ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువ కోట్ చేసిన వారికి ఈ నిర్మాణ పనులని ఇవ్వాలని నవంబర్ పదకొండు నుండి ప్రాజెక్ట్ పనులు మళ్ళీ ప్రారంభించాలని భావిస్తోంది.

రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి ? అనే విషయంలోకి వెళితే, ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక విధమైన మారు వేలం, దీనిలో కాంట్రాక్టర్ లు ప్రభుత్వాల పాత్రలు తారుమారు అవుతాయి. దీనిలో ప్రభుత్వం ఒక వైపు కాంట్రాక్టార్ లు అందరూ మరో వైపు పాల్గొంటారు. మామూలు వేలంలో కొనుగోలు దారులు తమకు కావాల్సిన వస్తువు అధిక ధరతో పొందడానికి పోటీ పడతారు. 

దీనికి విరుద్ధంగా రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వం కాంట్రాకర్ ల వద్ద నుండి అధిక మొత్తంలో నిర్మాణ వ్యయాన్ని ఆదా చేసుకోడానికి వారి మధ్య పోటీ పెంచుతుంది. కాంట్రాక్టర్ లు ఒకరి మీద ఒకరు పోటీగా తాము తక్కువ ధరకు చేస్తామంటే తాము తక్కువ ధరకు చేస్తామని నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తారు. రివర్స్ టెండరింగ్ వేలం పాట లాగే ఉంటుంది. కానీ ఈ రివర్స్ టెండరింగ్ విధానం సాఫ్ట్వేర్ ఆధారంగా నడిచే ఆన్ లైన్ లో జరిగే ఆక్షన్ వ్యవస్థ. ఈ ఆన్ లైన్ వేలంలో ఒకరి ధర మరొకరు చూసుకుని తమ కోట్ ను తెలియచేస్తారు. 

ఇది అత్యంత పారదర్శకంగా వేగవంతంగా నూతన సాంకేతిక విధానంలో జరగడం వలన ప్రాజెక్ట్ వ్యయంలో గణనీయమైన ఆదా చేయడం సాధ్యం అవుతుంది. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ప్రభుత్వ సంస్థల కొనుగోళ్లు ఈ విధానంలో నిర్వహిస్తున్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విధానానికి నాంది పలుకుతోంది. ఇక్కడొక కొసమెరుపు ఏంటంటే దేశంలో ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఈ ప్రొక్యూర్మెంట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ కార్యాచరణలో ఆవిష్కరించిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడికి చెందుతుంది.