స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే..


తెలంగాణ శాసనసభాపతి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. శాసనసభాపతి అభ్యర్థిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ దాఖలుచేశారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో ఆయన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల హాజరయ్యారు. స్పీకర్‌గా పోచారంకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో శాసనసభపతిగా పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

సభాపతి ఎన్నికకు సంబంధించి సీఎం కేసీఆర్‌ గత నెల రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఈ పదవికి అర్హులుగా భావించి ఒక జాబితాను రూపొందించారు. పలువురు నేతలతో మాట్లాడారు. చివరికి ఆయన పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్‌ శాసనసభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డికి మంచి అనుభవం ఉంది. ఆంగ్లంపై పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో శ్రీనివాస్‌రెడ్డి వైపు కేసీఆర్‌ మొగ్గు చూపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్‌ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు.