మోడీ ఆటలో క్లీన్‌బౌల్డ్ అయ్యేది ఎవరు..?

దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుని కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది..ఆ గెలుపు దేశ చరిత్రలో ఒక మలుపు..పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇదంతా జరగడానికి కారణం ఒక్కరే..ఆయనే ప్రధాని నరేంద్రమోడీ. కాంగ్రెస్ కంచుకోటల్లో కూడా కమలం వికసించిందంటే అందుకు ఆయన ఛరిష్మానే కారణం. చూస్తుండగానే మోడీ ప్రధానిగా వచ్చి అప్పుడే మూడున్నరేళ్లు గడిచిపోయింది. ఇంకొక్క ఆర్నెల్లు గడిస్తే సార్వత్రిక ఫీవర్‌తో దేశం ఊగిపోతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు మోడీ.

 

కుప్పలు, తెప్పలుగా ఉన్న చట్టాల్లోంచి జనానికి పనికిరాని వాటిని ఏరి పారేయడం, మేకిన్ ఇండియా, జన్‌ధన్ యోజన, సర్జికల్ స్ట్రైక్స్, నోట్లరద్దు ఇలా సగటు భారతీయుడి ఊహాకు కూడా అందని డెసిషన్స్‌తో ఇమేజ్ పెంచుకున్నారు. వీటితో పాటే విమర్శలు మూట గట్టుకున్నారు. జరగబోయే పరిణామాలు ముందే బేరిజు వేసుకున్నారో ఏమో కానీ ముందుస్తు అన్న మాట బీజేపీ శ్రేణుల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఏదో ఒక కారణం చేత బీజేపీకి దేశంలో సానుకూలత ఉంటే ఉండొచ్చు. కానీ మోడీ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు..ఈ మూడున్నరేళ్లలో చేసి చూపించిన దానికి అవగింజంతైనా పోలిక లేదు.

 

ఇలాంటి వేళ మార్పు కొరడాను ఝుళిపించేందుకు మోడీ రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. క్యాబినెట్‌లో ఖాళీలతో పాటు..వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో తన మంత్రివర్గంలో పనితీరు సరిగా లేని మంత్రులను సాగనంపేందుకు మోడీ కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే 2019 నాటికి తనతో నడిచే మిత్రులను వెతుక్కుంటున్నారట మోడీ. బీహార్‌లో జేడీయూ..తమిళనాడులో అన్నాడీఎంకేలకు చెందిన సభ్యులకు కేంద్రంలో మంత్రి పదవులు ఖాయమంటున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేస్తూనే ప్రజల్లో తన ఇమేజ్ తగ్గకుండా ఉండేందుకు రానున్న రోజుల్లో మరింత దూకుడును ప్రదర్శించబోతున్నారట ప్రధాని. మరి మోడీ కూడికలు..తీసివేతల్లో ఎవరు మిగులుతారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.