రికవరీ రేటు 71శాతం.. మరణాల రేటు 0.7శాతం

కరోనా అనుభవాలతో సమగ్ర వైద్య ప్రణాళిక రావాలి

 

గతంలోనూ ఎన్నో రకాల వైరస్ లు ప్రజలను అనారోగ్యం పాలు చేశాయి. భవిష్యత్ లోనూ ఇలాంటి వైరస్ లు దాడి చేసే ప్రమాదం ఉంది. కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా కట్టడిపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా ఎన్నో అనుభవాలను నేర్పిస్తోంది. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సమగ్ర వైద్య ప్రణాళికను రూపొందించాలని కెసీఆర్ సూచించారు.

 

వైద్యరంగంలో సరైన మార్పులు తీసుకురావాలి. జనాభా నిష్పత్తి ప్రకారం డాక్టర్ల నియామకాలు ఉండాలని కెసీఆర్ అన్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. రికవరీ రేటు 71శాతం ఉంది. మరణాల రేటు 0.7శాతం ఉంది. కరోనా సోకిన వారికి  మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఐసిఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. శక్తివంచన లేకుండా వైద్యసిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నారని ఆయన వివరించారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.