'హాయ్ విజయ్ గారూ'.. మోదీ ప్రత్యేక పలకరింపు!!

 

ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి సొంత పార్టీ నేతలు, ఎంపీలనే గుర్తించడం కష్టం. అలాంటిది ప్రధాని మోదీ.. వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డిని.. 'హాయ్ విజయ్ గారూ' అని పలకరించడం చర్చనీయాంశమైంది.

జమిలి ఎన్నికల విషయంపై పార్లమెంటు లైబ్రరీ భవనంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీల అధ్యక్షులకు తప్ప మిగతావారెవరికీ ఆ సమావేశంలో పాల్గొనే అనుమతి లేకపోవడంతో బయట ఉన్న లాంజ్‌లో వైసీపీ ఎంపీలు కూర్చున్నారు. సమావేశం ముగిసి తరువాత అందరూ బయటకు వస్తున్న క్రమంలో ఎంపీలు నిల్చున్నారు. అటుగా వచ్చిన ప్రధాని మోదీ.. విజయసాయిరెడ్డిని చూసి చేతులు ఊపుతూ ‘హాయ్.. విజయ్‌ గారూ’ అని ప్రత్యేకంగా పలకరించారు. దాంతో విజయసాయి ఆయన వద్దకు వచ్చి ఆయనతో కరచాలనం చేసి నమస్కరించారు.
 
ఈ ఘటనపై విజయసాయి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మోదీ తనను ప్రత్యేకంగా పలకరించిన వీడియో పోస్ట్ చేసి.. ‘‘ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధాని మోదీ బయటకు వెళుతూ లాబీలో వైఎస్‌ జగన్‌ గారి కోసం నిరీక్షిస్తున్న నన్ను చూసి 'హాయ్ విజయ్‌ గారు' అని పలకరిస్తూ నావైపుకు అడుగులు వేసి నాతో కరచాలనం చేశారు. ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం.’’ అని పేర్కొన్నారు.

మొత్తానికి ప్రధాని మోదీ, విజయ సాయి రెడ్డిని ప్రత్యేకంగా పలుకరించి వెళ్లటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.