వారణాసిలో 50 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ...

జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 నిర్వీర్యంపై తీసుకున్న నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎవరెన్ని రకాలుగా ఒత్తడి చేసినా ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు, దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేశామని ఆలయ నిర్మాణం దిశగా ఈ ట్రస్టు వేగంగా పని చేస్తోందని పేర్కొన్నారు. అరవై ఏడు ఎకరాల భూమిని ట్రస్ట్ కు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ నిన్న (ఆదివారం) ఉత్తర ప్రదేశ్ లోని తన సొంత నియోజక వర్గం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో పన్నెండు వందల యాభై నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టనున్న యాభై ప్రాజెక్ట్ లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఐ ఆర్ సీ టీ సీ కి చెందిన మహాగాల్ ప్రైవేట్ ఎక్స్ ప్రెస్ రైలును వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ రైలు దేశంలోని మూడు జ్యోతిర్లింగ క్షేత్రాలైన వారణాసి, ఓంకారేశ్వర్ లను కలుపుతూ నడవనుంది. ఇక వారణాసిలో నాలుగు వందల ముప్పై పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రిని ప్రధాని ప్రారంభించారు. నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రధాని వారణాసిలో అడుగుపెడుతూనే శ్రీ జగద్గురు విశ్వరాజ్ గురుకుల శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతొమ్మిది భాషల్లోకి అనువదించిన శ్రీ సిద్దాంత శిఖామణి గ్రంథాన్ని మొబైల్ అప్లికేషన్ ను ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని డిజిటలైజేషన్ చేయటం ద్వారా యువతకు అందుబాటులోకి తీసుకురావటం, వారిలో ప్రేరణ కలిగించడం శుభపరిణామం అన్నారు. 

ఇక పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ను దేశం నలుదిశలా వ్యాపింపచేసేందుకు కృషి చేస్తున్న వారిని ప్రధాని అభినందించారు. దేశ ప్రజలు భారత్ లో తయారయ్యే వస్తువులనే ఉపయోగించాలని పిలుపునిచ్చారు. గంగానది ప్రక్షాళనకు చేపట్టిన నమామీ గంగా ప్రాజెక్టు ప్రజల భాగస్వామ్యం వల్లే విజయవంతమైందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు ఏడు వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్టు మరో ఇరవై ఒక్క వేల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ హస్తకళా సంకుల్లో కాశీ ఏక్ రూప్ అనేక్ పేరుతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక హస్తకళల ప్రదర్శనను ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఉత్తర ప్రదేశ్ నలుమూలల నుంచి పది వేల మందికి పైగా కళాకారులు రూపొందించిన వస్తువులను ప్రదర్శించారు. యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆధిత్యనాథ్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప పాల్గొన్నారు. వారణాసిలో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని అరవై మూడు అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. స్మారక కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ దయాల్ ఆత్మ మనల్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తోందని ఆయన మనకు అంత్యోదయ మార్గాన్ని చూపించారని మోదీ అన్నారు. సమాజంలో చిట్ట చివర ఉన్న వారి అభివృద్ధే అంత్యోదయ అని దీనిని ఆచరణలో చూపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.