విజయ్ మాల్యా పరారీలో మోడీ హస్తం..!!

కేంద్ర ప్రభత్వంపై,మోడీపై రాహుల్ గాంధీ అవకాశం దొరికిన ప్రతిసారి విరుచుకుపడుతున్నారు.తాజాగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పరారీ వెనుక సీబీఐ, ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన దాడిని మరింత ఉదృతం చేశారు.ట్విటర్ వేదికగా ఇవాళ రాహుల్ స్పందిస్తూ..‘‘సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ మాల్యా ‘‘లుక్ అవుట్’’ నోటీసును నీరుగార్చి ఆయన పారిపోయేందుకు సహకరించారు. గుజరాత్ కేడర్ అధికారిగా పనిచేస్తున్న శర్మ ప్రధాని మోదీ కనుసన్నల్లో నడుచుకుంటున్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ పారిపోయేందుకు కూడా ఆయనే కారణం. అయ్యో.. దర్యాప్తు!’’ అని వ్యాఖ్యానించారు. కాగా మోదీ ఒత్తిడితో విజయ్ మాల్యా పారిపోయేందుకు సీబీఐ సహకరించిందంటూ ‘‘అదుపులోకి తీసుకోండి’’ అని ఉన్న లుక్‌అవుట్ నోటీసును ‘‘సమాచారం ఇవ్వండి’’ అంటూ సీబీఐ మార్చిందని రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియకుండా లుక్అవుట్ నోటీసును మర్చే అవకాశం లేదని కూడా ఆయన ఆరోపిస్తున్నారు.దేశం విడిచి పరారైన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తప్పించుకునేందుకు కూడా శర్మయే కారణమని ఆరోపించారు.