ఎన్నికల సంస్కరణ సాధ్యమేనా!

 

ప్రధానమంత్రి పెద్ద నోట్ల రద్దు మీద తన నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత, సామాజికవేత్తల నుంచి వచ్చిన తొలి అభ్యంతరం- ముందు ఎన్నికలలో ప్రవహిస్తున్న నల్లధనాన్ని ఎందుకు కట్టడి చేయడం లేదు? అనే. రెండు నెలలు గడిచిపోతున్నా పెద్ద నోట్ల రద్దు వల్ల లాభం జరిగిందా వెతల కథలే మిగిలాయా అన్న సందేహం ఇంకా మిగిలి ఉండటంతో.... విమర్శకుల నోళ్లు మూయించేందుకు మోదీ ఎన్నికల సంస్కరణల గురించి కూడా మాట్లాడారు.

 

నిన్న జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తూ మోదీ ఎన్నికల సంస్కరణల గురించి కొన్ని కీలకమైన అభిప్రాయాలను వెల్లడించారు. మనకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని అంటూనే.... ఆ దిశగా జరిగే సంస్కరణలకి భాజపా మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ విషయంలో అన్ని పార్టీల మద్దతు లభిస్తుందని ఆశించారు.

 

రాజకీయ పార్టీల విరాళాలకి సంబంధించి ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఒక కీలక ప్రకటన చేసింది. రెండువేలకి మించి వివిధ పార్టీలకు అందే విరాళానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వాన్ని సూచించింది. నిజానికి ఇరవై వేలకి మించి అందే వివరాలని అందించాలని ఇప్పటికే ఒక చట్టం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు వాటిని పాటిస్తున్న దాఖలాలు లేవు. ఇక ఆ పరిమితి రెండువేలకి దిగినప్పుడు, దాని నుంచి తప్పించుకునేందుకు పార్టీలు ఎలాంటి కుప్పిగంతులు వేస్తాయో చూడాలి.

 

రాజకీయ పార్టీలకీ నల్లధనానికీ అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే! ఎన్నికలలో ఎప్పుడైతే అభ్యర్థి ప్రతిభకంటే అతను వెదజల్లే డబ్బే కీలకంగా మారిపోతుందని తేలిందో డబ్బు కుప్పలు తెప్పలుగా ప్రవహించడం మొదలుపెట్టింది. నోటుకి వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత డబ్బు చేతుల్లోకి రావాలంటే, పార్టీలకు ఎవరో ఒకరు ఆర్థికంగా అండ నిలవాల్సిందే కదా!

 

సాధారణంగా లెక్కల్లోకి రానంతగా నల్లడబ్బుని కూడబెట్టుకున్న బడా పారిశ్రామికవేత్తలు, సారా కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్ వ్యాపారులు, మాఫియా లీడర్లు.. వంటి నానాజాతుల నుంచి ఈ డబ్బు అందుతూ ఉంటుంది. సహజంగానే వీరి డబ్బుతో అధికారంలోకి వచ్చి వ్యక్తులు, ఆ అధికారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దీంతో ఎన్నికలలో నల్లధనం మన ప్రజాస్వామ్య వ్యవస్థకే కాకుండా పాలనకి కూడా అడ్డుగా నిలుస్తోంది. సాక్షాత్తూ రిలయన్స్ వంటి సంస్థల నుంచి అనామత్తుగా కావల్సినంత విరాళాలు అందుతూ ఉండబట్టే, ప్రభుత్వం వాటకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలూ ఉన్నాయి.

 

అందుకనే ఎన్నికల విరాళాలకి సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టితీరాల్సిన అగత్యం ఉంది. కానీ ఇందుకు పార్టీలు ఏమేరకు సహకరిస్తాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే తమ ఉనికికి ఆటంకంగా తోచే ఏ విధానాన్నైతే వ్యతిరేకించడంలో మన పార్టీల మధ్య అధ్బుతమైన సమైక్యత ఉంటుంది. ఇప్పటివరకూ మహిళా రిజర్వేషన్‌ బిల్లుని ఆమోదించలేకపోవడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మరి అలాంటి అడ్డంకులను దాటుకుని ఎన్నికలలో నల్లధన ప్రవాహాన్ని అరికట్టడంతో మొదీ సఫలీకృతులవుతారా! అదే కనుక జరిగితే పెద్దనోట్ల రద్దుతో సమానమైన సంస్కరణగా అది మిగిలిపోతుంది.