ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్ను మూశారు

 

గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అలనాటి మధుర గాయకుడు విస్సంరాజు రామకృష్ణ ఈరోజు తెల్లవారు జామున జూబ్లీ హిల్స్ లో గల తన నివాసంలో కన్నుమూశారు. అమర గాయకుడు స్వర్గీయ ఘంటసాల తరువాత అంతటివాడని పేరు పొందిన ఏకైక గాయకుడు ఆయన. రామకృష్ణగా తెలుగు ప్రజలకు చిరపరిచితుడయిన ఆయన ఆగస్టు 20,1947లో రంగశాయి, రత్నం దంపతులకు జన్మించారు.

 

ఆయన మొదట 'ఆల్ ఇండియా రేడియో'లో పాటలు పాడేవారు. 1972సం.లో ఆయన విచిత్రబందం అనే సినిమా కోసం పాడిన ‘వయసే ఒక పూల తోట’ సినీ పాటల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. నాటి నుండి కొన్ని సం.ల క్రితం వరకు ఆయన తన పాటలతో తెలుగు ప్రజలను అలరారిస్తూనే ఉన్నారు. ఆయన సుమారు 5000 లకు పైగా పాటలు పాడారు. వాటిలో తాతా మనవడు, అందాల రాముడు, భక్త తుకారం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, అందరూ దొంగలే, చక్రవాకం, బలిపీఠం, యశోద కృష్ణ, ముత్యాలముగ్గు, భక్త కన్నప్ప, దానవీరశూర కర్ణ, కరుణామయుడు, వయసు పిలిచింది, యువతరం కదిలింది, శ్రీ షిరిడి సాయి మహత్యం, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలలో ఆయన పాడిన పాటలు తెలుగు ప్రజల హృదయాలలో ఎల్లప్పటికీ మెదులుతూనే ఉంటాయి. ఆ సినిమాలన్నీ హిట్స్ అందులో ఆయన పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్. నేటికీ ఆయన పాడిన పాటలు ప్రజలు అవలీలగా గుర్తుకు తెచ్చుకోగలరంటే ఆయన పాటకు, గొంతుకు ఎంత ప్రత్యేకత ఉందో అర్ధమవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో 1970-80 మధ్య విడుదలయిన అనేక సినిమాలలో ఆయన పాడిన ప్రతీపాట మధురమయినదే. ఆయనకు అజరామరమయిన కీర్తి ప్రతిష్టలను అందజేసినదే.

 

స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్ఆర్, శోభన్ బాబు వంటి మేటి నటులందరికీ ఆయన డబ్బింగ్ చెప్పారు. ఆయన సినిమా పాటలే కాకుండా భక్తి గీతాల ఆల్బమ్స్ కూడా చాలా చేసారు. వాటికీ ప్రజలలో అంతే విశేషాదరణ ఉండేది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సినీ సంగీత విభావరి నిర్వహించారు. అంతేకాదు గత కొన్నేళ్ళుగా ఆయన తెలుగు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. ఆయన భార్య పేరు జ్యోతీకృష్ణ. ఆమెకూడా గాయనీమణే. వారికి సాయి కిరణ్, లేఖ అనే ఇద్దరు సంతానం. వారిలో సాయి కిరణ్ 2001 సం.లో విడుదలయిన ‘నువ్వే కావాలి’ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. రామకృష్ణ అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్ లో జరుగవచ్చును.