క్యారీ బ్యాగ్‌లు ఎందుకంత ప్రమాదం!

చేతిలో గుడ్డసంచిని తీసుకుని బజారుకి బయల్దేరడం ఇప్పుడు నామోషీ. అలా సరదాగా సూపర్‌మార్కెట్లోకి వెళ్లి కాసేపు కాలక్షేపం చేసి ఓ రెండు వస్తువులను కొని.... ఓ క్యారీబ్యాగ్‌లో వేసుకురావడం ఓ ఫ్యాషన్‌! ఇక పాలప్యాకట్‌ని కూడా క్యారీబ్యాగ్‌లోనే పట్టుకునే సుకుమారం కొందరిది. సరదానో, సున్నితత్వమో కానీ క్యారీబ్యాగ్‌ల వాడకంతో పర్యావరణానికి తీరని హాని జరుగుతోందని బాధపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. వారి బాధలో అర్థం లేకపోలేదు.

నేలలో కలవదు

క్యారీబ్యాగ్‌లు ఒక పట్టాను మట్టిలో కలిసిపోవు. కాలం గడిచేకొద్దీ చిన్నచిన్న ముక్కలుగా పిగిలిపోయి కలిసినట్లు కనిపిస్తాయంతే! అలా నిదానంగా మట్టిలోకి జారుకునే సమయంలో క్యారీబ్యాగ్‌లు వెలువరించే విషరసాయనాలు, అక్కడి సారాన్ని పాడుచేస్తాయి. ఇలాంటి మట్టిన వాసన చూసే ప్రాణుల ఊపిరితిత్తుల్లోకి చేరి వాటి చావుకి కారణం అవుతాయి.

నీటిలో కరగదు

ఏటా మురుగు ద్వారా కొన్ని కోట్ల ప్లాస్టిక్‌బ్యాగ్‌లు సముద్రాలలో కలుస్తున్నాయి. ఇప్పుడు నదులలో కూడా ఎక్కడ చూసినా ఈ క్యారీబ్యాగులే తేలుతూ కనిపిస్తున్నాయి. వీటిని ఆహారంగా భ్రమించి నోటకరుచుకునే నీటి జంతువులు చావుకి దగ్గరవుతున్నాయి. దీనికి తోడు నగరాలలోకి డ్రైనేజిలో ఎప్పటికప్పుడు పేరుకుపోతున్న క్యారీబ్యాగ్‌లు, ఒకోసారి వరదలకు కూడా కారణం అవుతున్నాయి. మొన్నామధ్య ముంబై మహానగరం వర్షపునీటిలో మునిగిపోవడానికి కారణం, క్యారీబ్యాగ్‌ల వల్ల డ్రైనేజీలు పూడుకుపోవడం అని తేలింది.

జంతువులని వదలదు

మిగిలిపోయిన ఆహారాన్ని క్యారీబ్యాగ్‌లలో ముడివేసి పారేయడం మనకి ఉన్న అలవాటు. ఈ ఆహారం కోసం ఆవులు, కుక్కలు వంటి జంతువులు అమాంతం ప్లాస్టిక్‌ సంచులను కూడా తినేస్తూ ఉంటాయి. ఫలితం! జీర్ణాశయంలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ సంచులు, వాటికి చావుని రుచి చూపిస్తున్నాయి. కేవలం ఇలా ప్లాస్టిక్‌ సంచుల బారిన పడి ఏటా కొన్ని వేల జంతువులు చనిపోతున్నట్లు అంచనా!

రీసైక్లింగ్‌ జరగదు

క్యారీబ్యాగ్‌లను రీసైక్లింగ్‌ చేయడం కంటే కొత్తవాటిని ఉత్తత్తి చేయడమే తేలిక! అందుకని మనం వాడి పారేసిన క్యారీబ్యాగ్‌లలో కేవలం 1 శాతం మాత్రమే రీసైక్లింగ్‌కు నోచుకుంటాయని తేలింది. అందుకని వాటిని రీసైక్లింగ్ చేసే ఆలోచనే లేకుండా అవసరం అయితే తగలపెట్టి, అందులోని రసాయనాలను గాల్లో కలిపేందుకే పురపాలక సంస్థలు కూడా ప్రయత్నిస్తుంటాయి.
మరేం చేయడం???

- అన్నింటికంటే సులువైన మార్గం క్యారీబ్యాగ్లని వీలైనంతవరకూ వాడకపోవడం. చేతిలో ఒక సంచీని పట్టుకువెళ్లడమో, అలా చేయడం మొహమాటంగా అనిపిస్తే ఒక పాత ప్లాస్టిక్‌సంచిని జేబులో పెట్టుకుని వెళ్లడమో చేయాలి.

- కొన్ని ప్రదేశాలలో క్యారీబ్యాగ్‌ల బదులు పల్చటి గుడ్డతో చేసిన సంచులు లేకపోతే కాగితంతో చేసిన సంచులు అందుబాగులో ఉంటున్నాయి. అవకాశం ఉన్నప్పుడు అలాంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోండి.

- మరీ అవసరం అనుకుంటే మందపాటి క్యారీబ్యాగ్‌లనే వినియోగించండి. నిజానికి మన ప్రభుత్వం కనీసం 40 మైక్రాన్ల మందమైన క్యారీబ్యాగ్‌లనే వాడాలని ఎప్పుడో చట్టాన్ని తెచ్చింది. క్యారీబ్యాగ్‌లు ఇలా మందంగా ఉండటం వల్ల మట్టిని పాడుచేయవనీ, మళ్లీమళ్లీ వాడుకోవడానికి వీలుగా ఉంటాయనీ ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆచరణలో దీనిని పట్టించుకునేవారు తక్కువ.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం... వ్యాపారస్తులు క్యారీబ్యాగ్‌లను మన చేతిలో పెట్టేటప్పుడు నిజంగా వాటిని తీసుకోవాలా అక్కర్లేదా అని ఒక్క సెకను ఆలోచించడం. క్యారీబ్యాగ్‌ అవసరం లేదు అని మనకు అనిపించి, దాన్ని తిరిగిచ్చే ప్రతిసారీ.... మనం ఈ పర్యావరణానికి ఎంతో కొంత మేలుచేసినవారమవుతాం!

 

- నిర్జర.