రైలులో యువతికి వేధింపులు.. కాపాడిన మంత్రి పియూష్ గోయల్

 

కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్.. ఆపదలో ఉన్న ఓ యువతిని రక్షించడానికి సరైన సమయంలో స్పందించి రియల్ హీరో అనిపించుకున్నారు. విశాఖ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న 22415 నెంబర్ ట్రైన్‌లో యువతి ప్రయాణిస్తోంది. భూపాల్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్తున్న ఆ యువతి.. అనుకోని ఆపదలో చిక్కుకుంది. బాగా తాగి కోచ్‌లోకి వచ్చిన కొందరు యువకులు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టారు. దీంతో ఆమె విషయాన్ని ఫోన్ మెసేజ్ ద్వారా తన సోదరుడికి తెలియజేసింది. అయితే, రాంచీలో ఉన్న అతను తన సోదరిని ఎలా రక్షించాలో తెలియక.. వెంటనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే మంత్రి అధికారిక ట్విట్టర్‌ను అనుసంధానిస్తూ ‘సార్, నా సోదరి ట్రైన్ నంబర్ 22415లో ప్రయాణిస్తోంది. ఆమె బెర్త్ దగ్గరకు కొందరు యువకులు మద్యం మత్తులో వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేనిప్పుడు రాంచీలో ఉన్న కారణంగా.. సాయం చేయలేని స్థితిలో ఉన్నాను. మీ సాయం కోసం అభ్యర్థిస్తున్నాం.’ అని వేడుకున్నాడు. ఆ పోస్టును చూసిన రైల్వే మంత్రి వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. జీఆర్‌పీ పోలీసులను ఆమె ప్రయాణిస్తున్న ట్రైన్‌లోకి పంపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుల్ని అరెస్ట్ చేశారు. యువతిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు.