మొటిమల సమస్యలు..సందేహాలు

మొటిమలు..నేటి సమాజంలో అత్యంత ఇబ్బంది కలిగించే సమస్యల్లో ఒకటి. చాలా మంది అనుకున్నట్లు, మొటిమలు కేవలం టీనేజర్లను మాత్రమే కాదు..అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెడతాయి. కొంతమందికి పింపుల్స్ మరీ పీడకలలా వేధిస్తుంటాయి. చర్మాన్ని నాశనం చేయడంతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసే ఈ మొటిమల్ని నివారించడం ఎలా..? వాటి గురించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం రండి.


1. పింపుల్ అంటే ఏంటి..?
మొటిమ అనేది చర్మానికి సంబంధించిన ఒక హార్మోనల్ డిజార్డర్. అవసరమైన దానికంటే ఎక్కువ ఆండ్రోజన్లు ఉత్పత్పి అయిన పక్షంలో, చర్మానికి అవరసమైన దానికంటే ఎక్కువ నూనె ఏర్పడుతుంది. ఇది చర్మం గ్రంథులు వ్యాపించేలా చేస్తుంది. దాన్ని పింపుల్ లేదా మొటిమ అని అంటారు.

2. మొటిమల్లో ఎన్ని రకాలుంటాయి..?
పింపుల్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఓపెన్ కోమెడోన్స్, క్లోజ్డ్ కోమెడోన్స్ అని వీటిని అంటారు. వాడుక భాషలో ఓపెన్ కోమెడోన్స్ ను వైట్ హెడ్స్ అని, క్లోజ్డ్ కోమెడోన్స్ ను బ్లాక్ హెడ్స్ అని పిలుస్తారు. వెంట్రుక పెరిగే చోట మూసుకుపోయి, నూనె చేరుకుని ఏర్పడి పింపుల్ ను బ్లాక్ హెడ్ అంటారు. కొవ్వు కారణంగా ఏర్పడిన,తెల్లగా కనబడే మొటిమల్ని వైట్ హెడ్స్ అంటారు.

3. షేవింగ్ కారణంగా పింపుల్స్ వస్తాయా..?
ఆడవారిలోనే కాక, మగవారిలో కూడా పింపుల్స్ ప్రాబ్లెమ్ ఎక్కువగా ఉన్నవారు చాలా మందే ఉంటారు. షేవింగ్ కారణంగా పింపుల్స్ వస్తాయా అనేది చాలామందికి వచ్చే సందేహం. కేవలం షేవింగ్ కారణంగా ఇవి రానప్పటికీ, సరైన బ్లేడ్ లేదా షేవింగ్ క్రీమ్ ను వాడకపోతే, చర్మానికి ఎలర్జీ వచ్చి, మొటిమలుగా మారే అవకాశం ఉంది.

4. సెల్ ఫోన్స్ వాడకం కారణంగా పింపుల్స్ వస్తాయా..?
బుగ్గలపైన, లేదా ఫోన్ ను ముఖం మీద ఆనించి ఉంచే చోటులో పింపుల్స్ ఉంటే, వాటికి మొబైల్ ఫోన్ వాడకం ఒక కారణమయ్యే అవకాశం ఉంది. రోజూవారీ వాడకంలో, చేతుల నుంచి మొబైల్ ఫోన్ కు అనేక రకాల మురికి, డస్ట్, బ్యాక్టీరియా చేరుతుంటుంది. ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు, ఈ బ్యాక్టీరియా ముఖంపై చర్మానికి చేరుకునే అవకాశం ఉంది. రోజుకు ఒకసారైనా, మొబైల్ ను యాంటీ బ్యాక్టీరియల్ తో నీట్ గా తుడవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

5. ఒత్తిడి పింపుల్స్ ను కలిగిస్తుందా..?
పనిచేసే చోట, లేక పర్సనల్ లైఫ్ లో కలిగే రోజూ వారీ ఒత్తిళ్లు మానసికంగా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఒత్తిడి వలన డైరెక్ట్ గా పింపుల్స్ ఏర్పడే అవకాశం లేనప్పటికీ, ఇన్ డైరెక్ట్ గా కారణం కావచ్చు. ఒత్తిడి మరీ ఎక్కువై శరీరం హార్మోన్లు ఎక్కువ విడుదల చేస్తుంది. అది తిరిగి మొటిమలు ఏర్పడటానికే కారణం అవుతుంది.

6. సబ్బులు, యాంటీ పింపుల్ క్రీమ్స్ హెల్ప్ అవుతాయా..?
సరైన సబ్బులు, యాంటీ పింపుల్ క్రీమ్స్ ను వాడితే, ఫలితం ఉండచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు, రోజుకు రెండు సార్లు యాంటీ పింపుల్ క్లెన్సర్ తో గానీ, ఆయిల్ స్కిన్ కు వాడే క్లెన్సర్ ను గానీ ఉపయోగిస్తే మొటిమలు తగ్గడానికి ఆస్కారం ఉంది. అయితే మరీ ఎక్కువ క్రీములను ఉపయోగించడం కూడా ప్రమాదకరమే. యాంటీ ఆయిల్ క్రీమ్స్ ముఖం లోని ఆయిల్ శాతాన్ని పూర్తిగా తగ్గించి స్కిన్ డ్రై అయిపోవడానికి దోహదపడతాయి. ఇది మొటిమల్ని మరింత ఎక్కువ చేస్తుంది. ఇలాంటి క్రీమ్స్ వాడాలనుకుంటే, స్కిన్ స్పెషలిస్ట్ సూచనల మేరకు వాడటం చాలా మంచిది.

7. పింపుల్స్ ను చిదిమేయచ్చా..?
ఎక్కువ శాతం మందికి ఉండే క్వశ్చన్ ఇది. పింపుల్స్ ను చిదిమేయడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చా అని ఆలోచించే వారికి కొదువ లేదు. కానీ అలా చేయడం పింపుల్ ను తగ్గించకపోగా, మరింత ఎక్కువ చేస్తుంది. పైపెచ్చు విషమించి మరింత పెద్ద ఇన్ఫెక్షన్ లో కి దారి తీసే ప్రమాదం ఉంది. చిదిమిన తర్వాత పింపుల్ లో ఉండే బ్యాక్టీరియా మరింత లోతుకు వెళ్లిపోయి పుండుగా మారిపోయే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి వాటిని సహజంగా తగ్గించడమే సేఫ్ తప్ప, చిదిమడం అంత మంచిది కాదు.

అన్నింటికీ మించి మొటిమల సమస్యలతో బాధపడే వారు ప్రతీ రెండు మూడు గంటలకోసారి కేవలం నీటితో ముఖాన్ని కడుక్కోవడం ద్వారా పింపుల్స్ సమస్య అదుపులోకి తెచ్చుకోవచ్చు.