కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసిన పైలిన్ తుఫాన్

 

ఇంతవరకు సమైక్య ఉద్యమాలతో హోరెత్తిపోయిన సీమంద్రాలో తుఫాను రాకతో ఒక్కసారిగా ప్రశాంత నెలకొంది. గత రెండు మూడు నెలలుగా సీమాంద్రాలో ఉద్యమాలు, రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ నేతలు చాకో, షిండే, దిగ్విజయ్ సింగ్ వంటి వారి డైలాగులు, వాటిపై స్థానిక నేతల ప్రతిస్పందనలు, ఉద్యోగుల సమ్మె వార్తలు వ్రాసుకొంటూ కాలక్షేపం చేస్తున్న మీడియాకు పైలిన్ తుఫాన్ కొత్త టాపిక్ గా అందిరావడంతో, ‘ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో తుఫానులు మరియు వాటి పూర్వపరాలు’ మొదలయిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలతో లేటెస్ట్ గా రిలీజ్ అయిన పైలిన్ తుఫాన్ గురించి, అది సృష్టించబోయే విద్వంసం గురించి ఒకటే ఎక్సయిట్ అయిపోతూ ప్రజలని కూడా అందులోకి లాక్కుపోయాయి.

 

అలలు ఏవిధంగా ఎగిసిపడతాయో, అప్పుడు ప్రజలు ఏవిధంగా భయపడతారో వంటి అనేక ఆశ్చర్యకరమయిన విశేషాలను కూడా మీడియా వాళ్ళు తమ ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు తెలియజేస్తూ పైలిన్ తుఫానుకి వీడ్కోలు పలికి వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమాలతో, ఉద్యోగుల సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నమంత్రులు, శాసన సభ్యులు అందరూ కూడా తమను కాపాడేందుకు ఆ దేవుడే ఈ పైలిన్ తుఫానును పంపాడని భావిస్తూ కృతజ్ఞతలు తెలుపుకొంటూ, మళ్ళీ చాలా కాలం తరువాత తాము మంత్రులమనే సంగతిని గుర్తు తెచ్చుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

 

కానీ పైలిన్ తుఫాన్ వాయుగుండంగా మారి బీహార్ వైపు కదిలిపోవడంతో, మళ్ళీ రాజకీయనేతలలో ఆందోళన మొదలయింది. అయితే టీ-డ్రాఫ్ట్ శాసనసభకు వచ్చేవరకు వారికి కొంచెం ఊపిరిపీల్చుకోనేందుకు వెసులుబాటు దొరికింది. అంతవరకు మీడియా కూడా వార్తల కోసం మళ్ళీ దిగ్విజయ్ సింగ్, షిండే, చాకో, శరత్ పవర్ వంటి వారు చెప్పే కబుర్లు వ్రాసుకొంటూ కాలక్షేపం చేయక తప్పదు.