చంద్రబాబు సైకాలజీ పై సైంటిస్ట్ పేర్ని నాని రిపోర్ట్

* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ
* నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని
* ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు


పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు. 

చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు.

ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని.

వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.