కరోనా డేంజర్ బెల్స్... లక్షణాలు లేని రోగులతో మరింత ప్రమాదం

కరోనా మహమ్మారి మానవాళిని బెంబేలెత్తిస్తోంది. అయితే ఈ వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వచ్చి జనాన్ని భయపెడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక సర్వేలో కొన్ని ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ చేసిన ఈ సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారి కంటే ఎటువంటి లక్షణాలు లేని వారితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. ఎటువంటి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) రోగుల్లోనే వైరస్ లోడు ఎక్కువగా ఉందని ఈ సర్వేలో స్పష్టమైంది. గత మే, జూన్ నెలల్లో హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కరోనా సోకిన 210 మంది రోగుల డేటాను విశ్లేషించిన తరువాత తాజాగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతేకాకుండా వీరిలో 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం కరోనా వైరస్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

 

ఎటువంటి లక్షణాలు లేని రోగుల్లో ఇటు వైరస్ లోడు అధికంగా ఉండడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా అదే స్థాయిలో ఉండడంతో వారంతా బయటకు ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంటారని ఈ తాజా సర్వేలో తేలింది. ఈ రోగుల నుండి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకి వారి మరణానికి కారణమవుతున్నట్టు తాజా సర్వే లో తేలింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ అని నిర్ధారణ అవుతోంది. మిగిలిన 30 శాతం మందిలోనే కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తున్నాయి. దీంతో వైరస్ లోడు ఎక్కువగా ఉండే అసింప్టమాటిక్ రోగుల నుండి పిల్లలు, వృద్ధులకు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.