ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తుపాను... జగన్ పై ఊహించనిస్థాయిలో జనాగ్రహం

 

దాదాపు 50శాతం ఓట్లు... 151మంది ఎమ్మెల్యేలు... 22మంది ఎంపీలు... ఇది మామూలు విజయం కానేకాదు... ఒకవిధంగా చెప్పాలంటే అసాధారణ గెలుపు... ఒకవైపు యువకుడు... మరోవైపు కొత్త పార్టీ... పైగా పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఈ స్థాయిలో విజయాన్ని కట్టబెట్టారంటే... ప్రజలు అతని మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అది అలాంటిఇలాంటి నమ్మకం కాదు... జగన్ వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించారు. తమ జీవితాలను ఉద్దరిస్తాడని నమ్మారు. తమ బతుకులు బాగుపడాయని విశ్వసించారు. ఇంకా ఏవోవో అద్భుతాలు జరుగుతాయని ఊహించుకున్నారు. కానీ ప్రజల నమ్మకం వమ్ముకావడానికి ఎంతో సమయం పట్టలేదు. కొత్త ప్రభుత్వం రాకతో ఇసుక ఆగిపోయింది. దాంతో నిర్మాణరంగం మొత్తం కుదేలైంది. ఇసుకతో సంబంధమున్న అనేక విభాగాలకు అసలు పనే లేకుండా పోయింది. దాంతో ఇసుక కార్మికుడి నుంచి ఇంజనీర్ వరకు లక్షలాది మంది రోడ్డునపడ్డారు. ఏ రోజుకారోజు పనిచేస్తేనే కానీ పూట గడవని కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పుడు వీళ్లంతా జగన్ ని తిట్టిపోస్తున్నారు. తామేదో ఊహించుకుని ఓట్లేసి గెలిపించుకున్నామని, కానీ తమ బతుకులు ఇలా రోడ్డునపడతాయనుకోలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. జగన్ కు ఓటేసినందుకు తమకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనంటూ వాళ్లను వాళ్లే తిట్టుకుంటున్నారు. ఇది వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించువచ్చు, కానీ గ్రౌండ్ రియాల్టీ ఇలాగే ఉంది.

విప్లవాత్మక నిర్ణయాలంటూ మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే 20 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆగమేఘాల మీద ఆమోదింపజేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇసుక పాలసీని మాత్రం డిలే చేయడంలో ఆంతర్యమేంటో అర్ధంకావడం లేదు. పోనీ కొత్త పాలసీ తెచ్చేవరకు పాత విధానం కొనసాగిస్తే పెద్దగా జరిగే నష్టమేంటో తెలియడం లేదు. కేవలం ఈ ఒకే ఒక్క నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఇసుక తుపాను చెలరేగి విజృంభిస్తోంది. జనాగ్రహం రీడింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇది వైసీపీ ప్రభుత్వం ఊహించనిస్థాయికి చేరుకుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేల్కోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ ఊహించని రేంజ్ లో ఫలితాలు రావడం ఖాయం.