40 లక్షల చోరీ.. భారీ ఛేజింగ్.. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్!!

 

సినిమాల ప్రభావం జనరల్ ఆడియన్స్ మీద ఎంతుందో తెలీదు కానీ.. దొంగల మీద మాత్రం గట్టిగా ఉంది. ఎవరూ లేని ఇంట్లోనో, లేక నైట్ టైమో.. దొంగతనం చేసే రోజులు పోయాయి. స్టైల్ గా గన్ పట్టుకొని వస్తున్నారు. బ్యాంకు మీదనో, ఏటీఎం దగ్గరో ఎటాక్ చేస్తున్నారు. డబ్బులు ఎత్తుకొని పోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కూడా అలాంటి దొంగతనమే జరిగింది. అయితే ఈ దొంగతనంలో సినిమాల్లోలాగా ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ లు అబ్బో ఇలా చాలా ట్విస్ట్ లు ఉన్నాయి.

ఓపెన్ చేస్తే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 82. కేంద్రీయ విహార్ సొసైటీ గేట్ నెంబర్ 2 వద్ద ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం. సమయం మధ్యాహ్నం 1.45 గంటలు. ఒకరిద్దరు ఏటీఎం లో డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్నారు. చుట్టూ జనాలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ ఒక ముగ్గురు యువకులు మాత్రం.. అర్జునుడు బాణం ఎక్కుపెట్టి పక్షి కన్ను వైపే చూస్తున్నట్టు.. కళ్ళు అప్పగించి ఏటీఎం వైపే చూస్తున్నారు. ఇంతలో ఏటీఎం ముందు ఓ వ్యాన్ వచ్చి ఆగింది. ఆ ముగ్గురి యువకుల చూపు వ్యాన్ వైపు మళ్లింది. ఏటీఎంలో క్యాష్ నింపడానికి.. వ్యాన్ లో నుంచి నలుగురు క్యాష్ బాక్స్ పట్టుకుని కిందకు దిగుతున్నారు. అదిచూసి.. ఒక్కసారిగా ముగ్గురు యువకులు తమ వద్దనున్న నాటు తుపాకులతో కాల్పులు జరుపుతూ.. వ్యాన్ వైపు పరుగెత్తారు. షాక్ లో ఆ నలుగురి చేతిలో ఉన్న బాక్స్ కిందపడిపోయింది. కొద్ది క్షణాలకి తేరుకున్న సెక్యూరిటీ ఆ ముగ్గురి మీద కాల్పులు జరుపుదామని గన్ తీసేలోపు.. ఆ ముగ్గురు యువకులు క్యాష్ బాక్స్ ఓపెన్ చేసి చేతికి అందిన డబ్బు బ్యాగ్ లో వేసుకొని బైక్ మీద పారిపోవడం కూడా మొదలు పెట్టారు. ఇంకేముంది సెక్యూరిటీ వాళ్ళు.. దొంగలకు బుల్లెట్లు తగలకుండా, ముఖ్యంగా చుట్టూ జనాలకి తగలకుండా చాలా జాగ్రత్తగా షూట్ చేస్తూ బైక్ వెనుక పరుగెడుతున్నారు.

ఈ గన్ ల సౌండ్ కి.. పాపం బేరాలు లేక రిక్షాలో పడుకొని రెస్ట్ తీసుకుంటున్న రిక్షావాలా ఉలిక్కిపడి లేచాడు. చూస్తే.. ముందు బ్యాగ్ తో బైక్ మీద దొంగలు, వెనుక గన్నులతో సెక్యూరిటీ వాళ్ళు. రిక్షావాలాకి సీన్ అర్ధమైపోయింది. రిక్షావాలాలో చిరంజీవి స్టైల్ లో దొంగల బైక్ కి అడ్డంగా నిల్చున్నాడు. వాళ్ళేమన్నా మాములు మనుషులా అడ్డంగా నిల్చుంటే హార్న్ కొట్టడానికి. వాళ్ళ దగ్గరున్న నాటు తుపాకీ చూపించారు. అంతే.. రిక్షావాలా ఆటోమేటిక్ గా సైడ్ ఇచ్చాడు. కానీ సెక్యూరిటీ వాళ్ళ పరిస్థితి అలా కాదు కదా. దొంగల వెనుక పరుగెడుతూనే ఉన్నారు. సినిమాలో ఛేజ్ లాగా సాగుతూనే ఉంది. ఈ గ్యాప్ లో ఒకతను పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సినిమాల్లోలాగా లేట్ గా కాకుండా వాళ్ళు కూడా స్టేషన్ నుండి వెంటనే స్టార్ట్ అయ్యారు. మరోవైపు ఛేజ్ సాగుతూనే ఉంది. దొంగలు కంగారులో వెళ్లి ఎదురుగా వస్తున్న కారుని గుద్దారు. వాళ్ళు కింద పడ్డారు. వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ పైకి ఎగిరింది. దొంగతనం చేసే కంగారులో బ్యాగ్ జిప్ సరిగా పెట్టలేదనుకుంటా. ఆ బ్యాగ్ కంటే ఆ బ్యాగ్ లో ఉన్న 500 నోట్లు ఎక్కువ ఎత్తు ఎగిరాయి. చుట్టూ పడిపోయాయి. సెక్యూరిటీ వాళ్ళు ఆ దొంగలని పట్టుకునే పనిలో ఉంటే.. చుట్టూ జనాలు కింద కుప్పలు తెప్పలుగా పడ్డ డబ్బులు ఏరుకునే పనిలో పడ్డారు. ఇంతలో ఆ జనంలో నుంచి ఓ చిన్నపిల్లోడు వచ్చి వాడి బుడ్డి చేతులతో రెండు డబ్బుల కట్టలు పట్టుకొని పరుగెత్తాడు. ఇంతలో అక్కడికి పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది జనాలు దొరికినంత డబ్బులతో సైడ్ అయిపోయారు. పోలీసులు దొంగల్ని పట్టుకొని బ్యాగ్ లో మిగిలిన డబ్బుని, పక్కన పడున్న కొంత డబ్బుని సీజ్ చేసారు. తీరిగ్గా లెక్కలు చూస్తే అసలు ట్విస్ట్ తరువాత తెలిసింది. దొంగలు క్యాష్ బాక్స్ నుంచి 40 లక్షలు కొట్టేస్తే.. బైక్- కార్ యాక్సిడెంట్ పుణ్యమా అని అందులో 20 లక్షలు చుట్టూ జనాలు తీసుకెళ్లిపోయారట. దొంగలు బ్యాంక్ సొమ్ముని కొట్టేయడానికి ప్రయత్నించి జైలుకెళ్లారు. జనాలు అప్పనంగా రోడ్ మీద నోట్లు పడ్డయిగా అని తీసుకొని పరుగెత్తారు. అదన్నమాట కథ.