ప్రజల క్రమశిక్షణ సరే.. సర్కారుకు బాధ్యత సంగతేమిటి?

రోడ్లు బాగుచేయని సర్కారుకు చలాన్లు వేసేదెవరు?

 

జగన్ సర్కారుపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

 

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. హీరో మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా,  ఇప్పుడు ఆంధ్రాలో వాహనదారుల చావుకొచ్చిపడింది. ఆ సినిమాలో క్రమశిక్షణ లేకుండా, వాహనాలు నడుపుతున్న వారిని దారిలో పెట్టేందుకు.. సీఎం పాత్రధారి మహేష్, ట్రాఫిక్ చలాన్లు ఐదింతలు చేస్తూ నిర్ణయం తీసుకుంటాడు. దానితో జనం దారిలోకి వచ్చి, హెల్మెట్ పెట్టుకోవడం, రాంగ్‌రూట్లో వెళ్లకుండా క్రమశిక్షణ పాటిస్తారు. దానితో సీఎం మహేష్ జనం దృష్టిలో హీరోగా మారతాడు.

 

అది సినిమా. మనం చూసే సినిమాలకు లాజిక్కులుండవు. అప్పట్లో ఆ సినిమాను,  హైదరాబాద్‌లో చూసిన ఆంధ్రా సీఎం జగన్‌కు, మహేష్ పాత్ర విపరీతంగా నచ్చేసినట్లుంది. ఆ ప్రభావంతోనే ఇప్పుడు విధించిన ట్రాఫిక్ చలాన్లతో ఆయన ‘జగన్ అనే నేను’గా మారారు. వాహనదారులను క్రమశిక్షణలో పెట్టేందుకు,  జగన్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. యుశ్రారైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజయితే.. ‘జగన్ అనే నేను’పై బోలెడంత వ్యంగ్యం కురిపించారు.

 

తమకు క్రమశిక్షణ నేర్పించే ముందు, ప్రభుత్వం కూడా తన బాధ్యత నిర్వర్తించాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకు సాక్ష్యంగా దెబ్బతిన్న రోడ్లు, వాటివల్ల ప్రమాదానికి గురైన వాహనాల ఫొటోలు పెడుతున్నారు. సర్కారు నిర్ణయంతో, అటు లక్షలాదిమంది వాహనాదారుల్లో కూడా,వ్యతిరేకత పెరుగుతోంది.

 

ప్రభుత్వం తన ఖజానా నింపే వ్యూహంలో భాగంగానే, చలాన్ల పేరుతో దోపిడీ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆటోడ్రైవర్లయితే, తమకు 10 వేలు ఇచ్చి 25 వేలు వసూలు చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. దీనితో రంగంలోకి దిగిన రవాణాశాఖా మంత్రి పేర్ని నాని.. ఇదంతా ప్రజలను క్రమశిక్షణలో పెట్టేందుకు, ట్రాఫిక్‌పై అవగాహన పెంచే క్రమశిక్షణ చర్యలో భాగంగానే సూత్రీకరించారు.

 

నిజమే. ప్రజలకు ట్రాఫిక్‌పై, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బెజవాడ రోడ్లను చూస్తే, అంత ధిక్కారపర్వానికి-అరాచకవాదానికి ఏ పేరు పెట్టినా సరిపోదు. వాహనదారులది అంత అరాచకం మరి! రాంగ్‌రూట్‌లోకి వెళ్లి మరీ, ట్రాఫిక్ పోలీసులతో వాదులాటకు దిగే దృశ్యాలు,  రోజుకు కొన్ని డజన్ల సార్లు చూడవచ్చు. కార్లపై నిబంధనలకు విరుద్ధంగా చౌదరి, నాయుడు అని రాసుకుంటారు. ఇప్పుడు కొత్తగా రెడ్డీస్ అనే మూడక్షరాలు తోడయ్యాయి. ఇలాంటి ధిక్కారాల మెడ విరచడం అవసరమే.

 

వేగంగా వెళ్లే వాహనాలను, మద్యం తాగి డ్రైవింగ్ చే సే వారిని, లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసేవారిని, ఓవర్‌లోడ్‌తో వెళ్లే భారీ వాహనాలను కచ్చితంగా నియంత్రించాల్సిందే.  మంత్రి నాని సెలవిచ్చినట్లు.. క్రమశిక్షణతో, నిబంధనలు పాటించేవారెవరూ.. కొత్త చలాన్లకు భయపడాల్సిన పనిలేదు. మరి క్రమశిక్షణ ఒక్క పౌరులకేనా? ప్రభుత్వానికి అవసరం లేదా? అన్నది ఇప్పుడు తెరపైకొచ్చిన చర్చ. మొన్నామధ్య, మాజీ ఎంపి హర్షకుమార్ సర్కారుకు ఆసక్తికరమైన ఓ సవాల్ విసిరారు. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకూ ఉన్న,  గోదావరిపై ఉన్న ఫోర్త్ బ్రిడ్జిపై  సీఎం జగన్ కాన్వాయ్‌పై రాగలిగితే.. తాను రాజకీయాలు మానేస్తానన్న సవాల్ విసిరారు. నిజానికి హర్షకుమార్ ప్రస్ర్తావించిన ఆ రోడ్లపె,ై లారీల విడిభాగాలు కూడా కుదుపుల దెబ్బకు ఊడిపోతుంటాయి. ఇలాంటి బ్రిడ్జిలు బోలెడు. విజయవాడ నుంచి రాజమండ్రికి రావడానికి, కనీసం ఆరుగంటలు పడుతోందన్న హర్షకుమార్ ఆవేదనలో, అణువంత అబద్ధం కూడా లేదు. మరి ఆ ప్రకారంగా ప్రభుత్వంపై కూడా చలాన్లు విధించాలి కదా?

 

ఏపీలో ఉన్న రోడ్లలో ఇప్పటికే 46  శాతం దెబ్బతిన్నాయన్నది ఒక అంచనా. ఇక జాతీయ రహదారుల పరిస్థితి కూడా దారుణం.వీటిని పునర్నిర్మించేంత నిధులు సర్కారు వద్ద లేవన్నది వాస్తవం. ముందు ఇలాంటి కీలక సమస్యలను పరిష్కరించిన తర్వాత, ప్రభుత్వం చలాన్లపై దృష్టి పెడితే బాగుంటుంది.

 

ఇటీవలే బెజవాడ కనకద్గుమ్మ వారథి వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను.. కేంద్రమంత్రి, సీఎం కలసి ప్రారంభించారు. కానీ కొద్దిరోజులకే ఫ్లైఓవర్‌పై రోడ్డు పగుళ్లు పడి, పైనుంచి పెచ్చులు కింద పడటంతో, కానిస్టేబుల్ గాయాలపాలయ్యారు. మరి ఇలాంటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి చలాన్లు వేయరా? వేగంగా నడిపే వాహనాలకు చలాన్లు విధించడం బాగానే ఉంది. కానీ ఇటీవలి కాలంలో మంత్రుల కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొని, పోలీసులు గాయపడుతున్న సందర్భాలున్నాయి. మరి అప్పుడు చలాన్లు ఎవరికి వేయాలి? ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యే స్టికర్లు పెట్టుకుంటున్నారు. ఈ ధిక్కారంపై ఇంతవరకూ చలాన్లు విధించిన దాఖలాలు లేవు. రాష్ట్ర రాజధానిలో కొన్ని వేల వాహనాల అద్దాలకు, బ్లాక్ ఫిలింలు ఇప్పటికీ తొలగించలేదు. మరి ఆర్టీఏ అధికారులు నిద్రపోతున్నారా?

 

గత కొన్ని రోజుల నుంచి.. నిరంతరం కురుస్తున్న భారీ వర్షాల వల్ల, గ్రామాలు మునిగిపోతున్నాయి. కార్లు కొట్టుకుపోతున్నాయి. నగరాలు-పట్టణాలు జలమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 20,745 అక్రమ నిర్మాణాలు, 691 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని ఇటీవలే సర్కారీ శాఖనే వెల్లడించింది. మరి ఈ పాపం ఎవరిది? ప్రభుత్వాలు ఏ పార్టీవయినా, శిక్ష ఎవరికి విధిస్తారు? రాష్ట్రంలో రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలు.. అవినీతికి ఆలవాలమయ్యామన్న నివేదికలు వస్తూనే ఉన్నాయి. మరి వాటిపై ఎవరు,  ఎవరికి చలాన్లు విధిస్తారు?

 

గత కొద్దినెలల క్రితం ఏసీబీ డైరక్టర్ జనరల్  పీఎస్సార్ ఆంజనేయులు, అవినీతి ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా కేవలం మూడురోజుల్లో డజన్లమంది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. పీఎస్సార్ దూకుడుతో సర్కారీ ఉద్యోగుల వెన్నులో వణుకు పుట్టింది.  దానితో రెవిన్యూ ఉద్యోగుల సంఘం గగ్గోలు పెట్టింది. ఏసీబీ చర్యల వల్ల ప్రజలు ఉద్యోగులను, ముద్దాయిలుగా చూస్తున్నారని టన్నుల కొద్దీ కన్నీరు కార్చింది.  ఏసీబీకి మేమే దొరికామా? సర్కారు కార్యక్రమాలకు సహరిస్తున్నా, తమపై కావాలని వేధిస్తున్నారంటూ గావుకేకలు పెట్టింది. ఆశ్చర్యంగా మరుసటి రోజు నుంచీ,  ఏసీబీ మెరుపుదాడులు ఆగిపోయాయి.

 

దాన్నిబట్టి తెర వెనుక ఏసీబీపై,  ఎన్ని ఒత్తిళ్లు వచ్చాయన్నది ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ, సర్కారు కార్యక్రమాలకు సహకరిస్తున్నంత మాత్రాన, ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయకూడదా? వారు ఏసీబీ దాడులకు అతీతులా? ఇలాంటి అవినీతి జలగలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన తర్వాత, సర్కారు  ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తే బాగుండేది.

 

సీఎం జగన్ చూసిన,  ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా.. మహేష్ అదే చేశారు. కానీ ఈ ‘జగన్ అనే నేను’ హీరో మాత్రం, ఒక్క వాహనదారులపైనే ప్రతాపం చూపించడమే విచిత్రం. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో మైనింగ్ అక్రమ తవ్వకాలు, అడ్డగోలుగా జరుగుతున్నాయి. విశాఖ కేంద్రంగా కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. మంత్రులు-అధికార పార్టీ ఎమ్మెల్యేల సౌజన్యంతోనే, అవి విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న భూముల్లో అవినీతి జరుగుతోందని, నెల్లూరు లాంటి నగరం మాఫియాకు అడ్డాగా మారిందని,  స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. వీటికితోడు లిక్కర్, గుట్కా, ఇసుక, రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్న స్వైరవిహారం, మీడియాలో నిత్యం దర్శనమిస్తోంది. నిజానికి క్రమశిక్షణ లేని వాహనదారుల వల్ల, సమాజానికి పెద్ద ప్రమాదేమీ లేదు.వ్యక్తులకే నష్టం!  కానీ, సమాజానికి-రాష్ట్ర ఆదాయానికి గండికొట్టే ఇలాంటి ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపితేనే.. ‘జగన్ అనే నేను’ సినిమా హిట్టవుతుంది. ‘భరత్ అను నేను’ సినిమాలో మహేష్ కూడా చే సింది అదే!

-మార్తి సుబ్రహ్మణ్యం