ఒక కారు.. వంద అనుమానాలు... ప్రమాదమా? లేక యాక్సిడెంట్‌లా అల్లిన కథా?

కరీంనగర్‌ కాకతీయ కెనాల్‌లో దొరికిన కారుపై మిస్టరీ కొనసాగుతోంది. అది ప్రమాదమా? లేక యాక్సిడెంట్‌లా అల్లిన కథా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే సోదరి కుటుంబం... 20రోజులుగా కనిపించకపోయినా... ఎవ్వరూ పట్టించుకోకపోవడం మిస్టరీగా మారింది. అర్ధరాత్రిపూట కాలువలో ఒక బైక్ పడిపోతేనే స్థానికులకు శబ్ధం వినిపించి... రక్షించే ప్రయత్నంచేస్తే... మరి, అంతపెద్ద కారు... ప్రమాదానికి గురై... కాలువలో పడిపోతే.... ఎవ్వరికీ కనీసం చప్పుడు కూడా వినిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే, సత్యనారాయణరెడ్డి కుటుంబం కనిపించకుండాపోయి... ఇరవై రోజులైనా, కుటుంబ సభ‌్యులు గానీ, పనివాళ్లు కానీ, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నది అనేక సందేహాలు రేకెత్తిస్తోంది.

కరీంనగర్‌లో నివాసముంటున్న సత్యనారాయణరెడ్డి... తన భార్య రాధ, కూతురు వినయశ్రీతో కలిసి... జనవరి 27న సాయంత్రం 4గంటలకు హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. ఇది, సత్యనారాయణ ఇంటి దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డైంది. దాంతో, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే అన్ని టోల్ ప్లాజాలకు సత్యనారాయణరెడ్డి కారు నెంబర్ ...ఏపీ 15 బీఎన్‌ 3438ను పంపిన పోలీసులు... జనవరి 27కి ముందు... ఆ తర్వాత ఎప్పుడెప్పుడు వచ్చిందో వివరాలు సేకరిస్తున్నారు. అయితే, జనవరి 27కి ముందు.... సత్యనారాయణరెడ్డి కారు... పలుమార్లు గుండ్లపల్లి టోల్  ప్లాజా మీదుగా వెళ్లినట్లు గుర్తించినా, జనవరి 27 తర్వాత మాత్రం... హైదరాబాద్ కి వెళ్లే ఏ టోల్‌ప్లాజాను దాటలేదని తెలుస్తోంది.

అలాగే, కరీంనగర్‌లోని సత్యనారాయణరెడ్డి ఇంటి నుంచి పది సీసీటీవీ పాయింట్లతోపాటు కాకతీయ కాలువ దగ్గర్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు ఏ సమయంలో కారు... కెనాల్‌లో పడిందనేది మిస్టరీగా మారింది. ఇక, సత్యనారాయణరెడ్డి సెల్‌ ఫోన్ సిగ్నల్ ఎక్కడ మిస్సైంది. చివరిగా ఎక్కడ అందుబాటులో ఉందనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే, సత్యనారాయణరెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ మిస్సైన ప్రాంతంలో ఇంకా ఎవరెవరి ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే, 15రోజుల కింద సత్యనారాయణరెడ్డి, రాధ, వినయశ్రీ సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ చెప్పాలంటూ ఒకరు కరీంనగర్ త్రీటౌన్ పోలీసులను, అలాగే పెద్దపల్లి పోలీసులను సంప్రదించారన్న సమాచారం కలకలం రేపుతోంది. అయితే, ఈ ఎంక్వైరీ చేసిందెవరనేది సస్పెన్స్‌గా మారింది.

మొత్తానికి, ఒక్క కారు... వంద అనుమానాలు రేకెత్తిస్తోంది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబం అనుమానాస్పద మృతిపై అనేక ప్రశ్నలు రేగుతున్నాయి. జనవరి 27నే సత్యనారాయణరెడ్డి ఫోన్ స్విచ్ఛాప్ అయితే, అప్పట్నుంచి కారు దొరికే వరకు ఆ కుటుంబం ఏమైందో... ఎక్కడికి వెళ్లిందో... కనీసం ఆరా తీసిన వాళ్లే లేకపోవడంతో... ఆ ముగ్గురి మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. పైగా, డ్రైవింగ్ సీట్లో ఉండాల్సిన సత్యనారాయణరెడ్డి మృతదేహం కూడా... కారు వెనుక సీట్లో ఉండటంపైనా సందేహాలు కలిగిస్తున్నాయి. ఈ సందేహాలన్నీ తీరాలంటే సీసీటీవీ ఫుటేజే ఆధారం. మరి, కారు మిస్టరీని ఛేదించే ఆధారాలు దొరుకుతాయో లేక ముగ్గురి మృతి మిస్టరీగా మిగిలిపోతుందో మున్ముందు తేలుతుంది.