సముద్రం దగ్గరకి వెళ్తే... ప్రశాంతత దొరికినట్లే!


 

మనలో చాలామందికి సముద్రమంటే భలే ఇష్టం. కొంతమందిలో ఆ ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందంటే, రిటైర్‌ అయ్యాక సముద్రపు ఒడ్డునే ఓ ఇల్లు కట్టుకోవాలని కలలు కంటూ ఉంటారు. మనిషి జీవితంలో సముద్రానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాకపోవచ్చు. వ్యాపారం దగ్గర్నుంచీ, వర్షాల వరకూ సముద్రం లేనిదే బతుకు సాగదు. అంతవరకూ బాగానే ఉంది కానీ.... విశాలమైన సముద్రపు ఒడ్డున సమయాన్ని గడపాలని మనిషి ఎందుకంతగా తపించిపోతాడు? ప్రపంచంలో ఇన్ని సౌఖ్యాలు ఉన్నా మనిషి సమద్రపు ఒడ్డుకే ఎందుకు పరిగెడతాడు! సముద్ర తీరంలో ఉండే ప్రదేశాలు, అక్కడ ఉండే ఇళ్లకి ఎందుకంత గిరాకీ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.


సముద్రం, మనిషికి ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని ఇస్తుందట. ఆ సముద్రపు నీలపు రంగు, అందులో నుంచి వచ్చే అలల శబ్దాలు, ఆ అలల మీదుగా తేలియాడుతూ వచ్చే సముద్రపు గాలి, ఆ గాలిలోని స్వచ్ఛమైన వాసన... అతని ఇంద్రియాలన్నింటికీ ఉత్తేజాన్ని కలిగిస్తాయట. ఇవన్నీ ఎవరా దారిన పోయే దానయ్య చెప్పిన విషయాలు కాదు. మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తేల్చిన అంశాలు. ఇందుకోసం వాళ్లు వెల్లింగ్‌టన్‌, హవాయ్‌ వంటి సముద్ర తీర ప్రాంతాలను గమనించారు. అక్కడి ప్రజలు మిగతా ప్రాంతాల ప్రజలతో పోలిస్తే చాలా సంతోషంగా ఉన్నట్లు గ్రహించారు. ఆదాయం, ఆస్తులు, వయసు.... వీటన్నింటికీ అతీతంగా అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు! అక్కడ ప్రజల్లో మానసికమైన సమస్యలు కూడా తక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.

 

అదండీ విషయం! సిమెంటు కట్టడాలు ఎన్ని కనిపించినా, భౌతికమైన సుఖాలు ఎన్ని ఊరిస్తున్నామనిషి అంతరంగం ప్రకృతిలోనే సేదతీరుతుంది. భూమ్మీద మూడు వంతులుగా ఉన్న సముద్రం ఆ పకృతికి ఓ ప్రతిరూపంగా నిలుస్తుంది. అందుకే ఈసారి కాస్త సేదతీరాలనుకుంటే దగ్గరలో ఏదన్నా సముద్రపు ఒడ్డు ఉందేమో చూసుకోండి!