పార్టీకి సేవ చేసుకోవడానికీ పోటీయేనా?

 

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్ష పదవి చేపడుతూనే ‘ఒక వ్యక్తికి- ఒకే పదవి’ అంటూ తన పార్టీ నేతల గుండెల్లో బాంబులు పేల్చారు. పార్టీ కోసం పనిచేసే వారు ప్రభుత్వంలో పదవులు చేపట్టకూడదు అంటూ మరో బాంబు కూడా పేల్చారు. అంతవరకు ఒక్కొకరూ రెండు మూడు పదవులలో రాజభోగం వెలగపెడుతున్నవారికి ఆయన మాటలు రుచించకపోయినా పాటించకతప్పని పరిస్థితి.

 

మిగిలిన వారి సంగతెలా ఉన్నపటికీ, అందరి కళ్ళు పీసిసి అధ్యక్షుడిగా, రవాణాశాఖ మంత్రిగా జోడు గుర్రాల రధంలో కులాసాగా సాగిపోతున్న బొత్స సత్యనారాయణ మీదనే పడ్డాయి. కానీ, రాహుల్ బాబుని తనకు ఓ రెండు నెలల సమయం కావాలని ముందుగానే ఒప్పించుకోవడంతో తన రధం మీద ఆయన మరికొంత దూరం ప్రయాణం పూర్తి చేసేసుకొన్నాక, తానూ మంత్రి పదవిని తృణ ప్రాయంగా త్యజించేసి శేషజీవితం పీసీసీ అధ్యక్షుడిగా పార్టీకే సేవచేసుకొని తరించాలనుకొంటున్నట్లు తెలియజేశారు. అందుకు అందరూ ఆయనను అభినందదించకపోగా అపార్ధం చేసుకొన్నారు.

 

ఇంతకాలం పీసీసీ అధ్యక్షుడిగా సాక్షాత్ ముఖ్యమంత్రిని కూడా గడగడలాడించి ఒక వెలుగు వెలిగిన ఆయన, తన పీసీసీ అధ్యక్ష పదవినికాదనుకొని ముఖ్యమంత్రి నించోమంటే నించొని కూర్చోమంటే కూర్చొనే మంత్రి పదవి తీసుకోవడం ఇష్టం లేకనే, పార్టీ సేవ అంటున్నారని కొందరు అభిప్రాయ పడితే, అదేమి కాదు పీసీసీ అధ్యక్ష పదవిలో తానుంటే తన యం.యల్యే. టికెట్టు, మంత్రి పదవి రెండూ కూడా తనవాళ్ళకే ఇప్పించుకొవచ్చునని, అప్పుడు మళ్ళీ రెండు పదవులు కూడా తమ ఇంట్లోనే ఉంటాయని ఆయన ఐడియా అని మరికొందరు సన్నాయి నొక్కులు నొక్క సాగారు. మరికొందరు ఆయన కావాలనుకొంటే తన వాళ్లకి యం.యల్యే. టిక్కెటు, మంత్రి పదవి ఇప్పించుకోగలరు కానీ, తానూ మంత్రి పదవి తీసుకొని తనవాళ్ళకి పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకోలేరు కదా అందుకే, పార్టీ సేవ అంటున్నారని ఆయన మీద లేనిపోని అభాండాలు వేయసాగారు.

 

మొత్తం మీద ఆయన ఐడియా ఆయన రాజకీయ జీవితాన్ని మార్చేస్తుందో లేదో ఇంకా స్పష్టం అవలేదు కానీ, ఆయన ఇంకా కుర్చీ లోంచి కాలు క్రింద పెట్టక ముందే అందులో కూర్చోవడానికి మల్లు రవికుమార్, డీ. శ్రీనివాస్, మల్లు బట్టి విక్రమార్క, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఆనంద భాస్కర్ తదితరులు తన కుర్చీ పక్కనే సిద్దంగా ఉండటం చూసి, ‘పార్టీకి సేవ చేసుకోవడానికి కూడా నాతో ఇంతమంది పోటీకి రావాలా?’ అంటూ ఆయన చాల నొచ్చుకొన్నారు.

 

‘ముఖ్యమంత్రి, స్పీకర్, శాసన మండలి స్పీకర్ అందరూ మీ అంద్రోళ్ళే ఉన్నారు గనుక, మా పీసీసీ అధ్యక్షుడి పదవి మాగావలె’ అంటూ తెలంగాణా నేతలు కొంతమందిని తెలివిగా పోటీలోంచి తప్పించగలిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ‘బొత్స తప్ప వేరేవరయినా పరువలేదన్నట్లు’ బొత్స డిల్లీలో వాలకముందే కేంద్రానికి స్పష్టమయిన సంకేతాలు పంపేసినట్లు సమాచారం.

 

ఇక, కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిస్థితులే తల ఎత్తుతే వెంటనే అక్కడ ప్రతాప్ సింగ్ బాజ్వ అనే యువకుడికి పీసీసీ అధ్యక్షపదవి కట్ట బెట్టినట్లు సమాచారం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఫార్ములా తప్పదని అందరు అనుకొంటుంటే అసలు తన పరిస్థితి ఏమిటో తనకే అర్ధం కాకపోవడంతో బొత్సగారు చాల కలవరపడుతూ డిల్లీకి బయలుదేరిపోతున్నారు.