శాసనసభలో పయ్యావుల ప్రసంగం

 

ఈ రోజు శాసనసభలో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ తెదేపా సభ్యుడు పయ్యావుల కేశవ్ అనర్గళంగా ప్రసంగించారు. తెలంగాణా సాయుధ పోరాటం మొదలుకొని సమైక్యాంధ్ర కోసం జరిగిన పెద్దమనుషుల ఒప్పందం, సాగునీరు, ప్రాజెక్టులు, అభివృద్ధి తదితర అనేక అంశాల గురించి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండటం వలన ఏవిధంగా తెలంగాణా అభివృద్ధి జరిగిందో వివరించారు. అలనాడు పటేల్ పట్వారీ పెత్తందారులకు, దొరలకు వ్యతిరేఖంగా ప్రజలు పోరాటం చేసారని, ఆ తరువాత స్వర్గీయ యన్టీఆర్ హయాంలో ఆ వ్యవస్థలను రద్దు చేసారని, కానీ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వంటి దొరలు పుట్టుకొచ్చారని ఆయన తెరాస నేతలకు చురకలు వేసారు. వారు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం చరిత్రను వక్రీకరించి, ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించి ఉద్యమాలు నడిపి, మళ్ళీ పెత్తందారీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. సోనియాగాంధీ కొడుకు కోసమో, విజయమ్మ కొడుకు కోసమో లేకపోతే కేసీఆర్ కొడుకు కోసమో రాష్ట్ర విభజన చేయడం సరికాదని ఆయన వాదించారు. చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టుకి వ్యతిరేఖంగా పోరాటం చేసి జైలుకి కూడా వెళితే, కేసీఆర్ తెలంగాణా ప్రజల కోసం ఏమి చేసారో చెప్పాలని పయ్యావుల నిలదీశారు.

 

స్వర్గీయ యన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ కూడా తెలంగాణాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి చిత్తశుద్ధితో కృషి చేసినందునే నేడు ఇంత అభివృద్ధి జరిగిందని ఆయన గుర్తు చేసి, మరి అటువంటప్పుడు సీమాంధ్ర నేతలు, ప్రజలు తెలంగాణాను దోచుకుతింటున్నారని తెరాస నేతలు ఏవిధంగా ఆరోపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.