పవన్ వర్సెస్ చింతమనేని.. గెలుపెవరిది?

పవన్ వర్సెస్ చింతమనేని మాటల యుద్ధం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.రీసెంట్ గా దెందులూరులో పర్యటించిన పవన్ కళ్యాణ్.. చింతమనేనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై చాలా కేసులున్నా.. రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. చింతమనేని ఒక రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన చింతమనేని.. తనపట్ల వచ్చిన ఆరోపణలపై మీకు ఇష్టమొచ్చిన కమిటీ వేసుకోండని సవాల్ విసిరినా సంగతి కూడా తెలిసిందే. అంతేకాకుండా నీకు దమ్ముంటే నాపై గెలువు. నీ సామాజికవర్గ ఓటర్లే నిన్ను తిరస్కరిస్తారని చింతమనేని పవన్ కు సవాల్ విసిరారు.

 

 

దెందులూరు నియోజకవర్గంలో చింతమనేకి మంచి పేరుంది. ఇంటికి ఎవరు వచ్చినా.. చెయ్యి కడగకుండా వారిని బయటకు వెళ్లనివ్వరు. అదేవిధంగా సమస్యల పరిష్కారంలో చింతమనేని స్టైలే వేరు. త్వరగా స్పందిస్తారు త్వరగా సమస్యలు పరిష్కరిస్తారు. అధికారుల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. ఆయన వ్యాపార లావాదేవీలు ఏమున్నాయో తమకు తెలియదని.. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో ఆయన ఎప్పుడూ లంచాలు తీసుకోలేదని నియోజకవర్గ అధికారులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. చింతమనేని సామాజికవర్గ అధికారులు అక్కడ తక్కువగా ఉన్నారు.. కాపు, బిసి కులాలకు చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నారు. అయినా చింతమనేని పట్ల అధికారులు పాజిటివ్ గా ఉండటం విశేషం.


కుల మదంతో చింతమనేని విర్రవీగుతున్నారని సోషల్‌మీడియాలో పవన్‌ అభిమానులు కొందరు పోస్టింగ్‌లు పెడుతున్నారు. అయితే నియోజకవర్గంలో లక్షా 80వేల ఓట్లు ఉండగా.. అందులో కమ్మ సామాజికవర్గ ఓట్లు 30వేలు మాత్రమే. మిగతా లక్షా యాభైవేల ఓట్లు ఇతర కులాల వారివే. కేవలం కమ్మ సామాజికవర్గ ఓట్లతోనే ఆయన ఎలా గెలుస్తారు?. కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్న గ్రామాల్లో కూడా ఓటర్లు చింతమనేనికి బ్రహ్మరథం పడుతున్నారు. సినీహీరోగా పవన్‌ ను గౌరవిస్తాం, ప్రేమిస్తాం.. ఓటు మాత్రం చింతమనేనికే వేస్తామని కాపు వర్గానికి చెందిన ఓటర్లు చెబుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన యువత మాత్రమే పవన్‌ వైపు ఉంటారని.. మిగతా వారు చింతమనేని వైపు నిలుస్తారని వారు చెబుతున్నారు.

 

 

చింతమనేని ఆకురౌడీ అంటూ పవన్‌ వ్యాఖ్యలు చేసినా.. చింతమనేని వ్యక్తిగత విమర్శలకు దిగకుండా.. అవును నేను రౌడీనే. అసెంబ్లీ రౌడీ సినిమాలో శివాజీ ఎలా గెలిచాడో.. నేను కూడా అలాగే గెలిచి వస్తా. దమ్ముంటే తనపై గెలవాలని పవన్‌ కు సవాల్‌ విసిరారు. చింతమనేనికి ఆయన సామాజికవర్గాల మద్దతు ఉందో లేదో కానీ మెజార్టీ ఓటర్లు మాత్రం ఆయన వైపే మొగ్గుచూపుతున్నారు. ఆయన ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు.. పనిచేస్తారు.. అధికారులతో ఆగమేఘాలపై పనులు చేయిస్తారు. ఇంటికి ఏ కులం వారు వచ్చినా వారిని గౌరవంగా పలకరిస్తారు. ఆయనకు కోపం వస్తే దూకుడుగా మాట్లాడతారు తప్ప ఆయన కడుపులో ఏమీ ఉంచుకోరని అక్కడి వారు చెబుతుంటారు. ఇదే విషయంపై మీడియా వర్గాలు జిల్లా అధికార వర్గాలతో సంప్రదించగా ఆయన అప్పుడప్పుడు తమతో మాట్లాడతారని.. పనుల విషయంపై చర్చిస్తారని.. వాటి అమలులో దూకుడగా వ్యవహరిస్తారని చెప్పారు. ఇదే విషయాన్ని లేటుగా తెలుసుకున్న పవన్‌, చింతమనేనిపై విమర్శలు తగ్గించారు.