జనసేనకి కుల ముద్ర....పవన్ మళ్ళీ తప్పు చేస్తున్నాడా?

 

ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు చేయడం అంటే ఏమిటో ఏపీ ఓటర్లకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదేమో ? తాజా ఎన్నికల్లో హీరోలం అనుకునే వారిని జీరోలు చేసి, రూలర్స్ అనుకునే వారిని ఇంటికే పరిమితం చేసి పారేశారు. నిజానికి ఏపీ వోటర్లు రాజకీయ చైతన్యం కలవారే, కానీ ఏపీలో రాజకీయాలు చేయాలంటే ఎన్నో మెళుకువలు నేర్చుకోవాలి. చాలా చోట్ల కుల సమీకరణలతోనే ముందుకు వెళ్ళాలి. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా డిపాజిట్ లు కూడా లేకుండా పోతారు. ఈ విషయం మొన్నటి ఎన్నికలు బాగా క్లారిటీ ఇచ్చి మరీ చూపాయి. అయితే అయినా ఈ దెబ్బకి గుణ పాఠం నేర్చుకోని పవన్ మళ్ళీ జనసేన విషయంలో అదే తప్పు చేస్తున్నాడు. 

నిజానికి పవన్ పార్టీ జనసేనకి కాపు పార్టీ అనే ముద్ర పడింది. అయినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని ఆయన ఎన్నికల ముందు కూడా ఎంతో మంది కాపు నేతలను ఆయన పార్టీలో చేర్చుకున్నారు. జనం కోలుకోలేని విధంగా సమాధానం ఇచ్చారు. అయినా పవన్ తీరు మారినట్టు కనిపించడంలేదు. వంగవీటి వారసుడు రాధాకృష్ణని పార్టీ లో చేర్చుకోవాలని చూడడమే దానికి నిదర్శనం. అయితే ఏపీలో టీడీపీకి కమ్మ, వైసీపీకి రెడ్డి కులాల సపోర్ట్ నేరుగా ఉందని భావిస్తున్న పవన్ జనసేన పార్టీకి కాపు నాయకులని తీసుకున్నా ఫర్లేదని భావిస్తున్నారట. అయితే వంగవీటి రాధాని తీసుకోవడం వల్ల పవన్ కి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. మొన్నటి ఎన్నికల ముందు జగన్ ని తిట్టి టీడీపీలో చేరిన రాధాకు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. అయితే రాధా ఉత్తర కోస్తాలో పలు చోట్ల తిరిగి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి కూడా బాలేకపోవడం వలన జనసేన వైపు చూస్తున్నారు. 

నిజానికి ఆయన జనసేనలో చేరినా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయనకీ సొంతంగా చరిష్మా లేదు, తండ్రి రంగా పేరు చెప్పుకుని ఆయన ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అతని వలన కాపు ఓట్లు కొన్నిఅయితే వచ్చాయి, కానీ ఆ తర్వాత వైసీపీ లోకి చేరిన తర్వాత రాధా ద్వారా వైసీపీ పెద్దగా చేకూరిన లాభం ఏమి లేదు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే మొన్న ఎన్నికల ప్రచారంలో తనను కాపుగా చూడకండి అని తాను అందరివాడిని అని ప్రసంగాలు దంచిన పవన్ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా గేట్లు తెరిచాడు అనేదే అర్ధం కాని విషయం. ఒక పక్క సొంత పార్టీలో ఉన్న ఆకుల సత్యనారయణ లాంటి వాళ్ళు నేరుగా పవన్ కి రాజకీయం రాదని విమర్శిస్తుంటే తాను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాననేందుకే ఇలా చేస్తున్నాడా అనేది కూడా విశ్లేషణలకి అంతు చిక్కకుండా ఉంది.