చిరంజీవి బాటలో పవన్.. ఎమ్మెల్యే పోటీలో ఊహించని ట్విస్ట్!!

 

ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి దూరం జరుగుతూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. తరువాత పూర్తిగా దూరం జరిగి విమర్శలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీకి కూడా సిద్ధమయ్యారు. ఏపీలోని మొత్తం 175 స్థానాల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ ప్రకటించారు. అయితే పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారని.. లేదా గత ఎన్నికల్లో లాగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీతో కలిసి పనిచేస్తారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. వీటిని పవన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. జన సైనికులు కూడా పవన్ కి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సరే.. జన సైనికులతో పాటు ఇప్పుడు సామాన్యులను ఓ ప్రశ్న వేధిస్తోంది. అదే పవన్ ఎమ్మెల్యేగా ఎక్కడినుంచి పోటీ చేస్తారు?. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తాం అంటున్నారు బాగానే ఉంది. మిగతా స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో తెలీదు కానీ ముందు పవన్ పోటీ చేసే స్థానం చెప్పండంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

పవన్ తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థానం గురించి ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలీదు కానీ.. ప్రజలను మాత్రం బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పవన్ ఒకసారి అనంతపురం నుంచి పోటీ చేస్తా అన్నారు. ఒకసారి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి అన్నారు. మరోసారి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అన్నారు. ఇలా ఒకోసారి.. ఒకో సభలో.. ఒకో పేరు చెప్పారు. దీంతో పవన్ అసలు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో అర్ధంగాక జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. తాను పోటీ చేసే స్థానం మీద స్పష్టత కోసం పవన్ తెగ కసరత్తులు చేస్తున్నారట. ఒకవైపు 175 స్థానాల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను పోటీ చేసే స్థానం ఎంపిక విషయంలోనూ నిమగ్నమయ్యారట. ఇన్నిరోజులు పవన్ పోటీ చేసే స్థానం అంటూ అనంతపురం, ఇచ్చాపురం, పిఠాపురం ఇలా రకరకాల పురం పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరోపేరు తెరమీదకు వచ్చింది. అదే గతంలో చిరంజీవి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన తిరుపతి.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో చిరంజీవి తిరుపతి, పాలకొల్లు రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. తిరుపతి నుంచి గెలుపొందారు. తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ విషయంలో పవన్ కూడా తన అన్నయ్య చిరంజీవి బాటలోనే వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలని తర్జనభర్జన పడుతుండగా.. గతంలో అన్నయ్య చిరంజీవిని గెలిపించిన తిరుపతి నుంచి పోటీ చేయమని కొందరు మెగా అభిమానులు సూచించారట. దీనిపై పవన్ కూడా కాస్త సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి కంటే శ్రీకాకుళం జిల్లా లేదా గోదావరి జిల్లాల నుంచి పోటీ చేయడం మంచిదని సలహా ఇస్తున్నారట. ఇంకా కొందరైతే రెండు స్థానాల నుంచి పోటీ చేయమని సలహా ఇస్తున్నారట. దీంతో ఆలోచనలో పడ్డ పవన్ తిరుపతి, ఇచ్చాపురం, పిఠాపురంలలో ఏవైనా రెండు స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట. మరి పవన్ గతంలో చిరంజీవికి విజయం అందించిన తిరుపతి నుంచి పోటీ చేస్తారేమో చూడాలి.