అరవింద్ నన్ను అలా చూశారు... పరకాల ఇప్పుడేమైంది...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమైందో ఏమో తెలియదు కానీ.. అందరికీ ఒక్కసారిగా క్లాస్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. విశాఖలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపడానికి వచ్చిన పవన్ మూడు రోజులు అక్కడే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన అధికార పార్టీపైనా... ప్రతిపక్ష పార్టీ నేత జగన్ పైనా, ఇంకా బీజేపీ పైనా అందరినీ తన మాటలతో ఏకిపారేశాడు. తను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో... ఎలా వచ్చానో... తన అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీ గురించి... తన అన్నను మోసం చేశారని... ఇలా ఒకటేమిటి చాలా విషయాలపైనే పవన్ మాట్లాడాడు.

 

ఇక ఈరోజు రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ మళ్లీ అదే రేంజ్ లో రెచ్చిపోయాడు. విపక్షం అంటే ఎలా ఉండాలి, రాజకీయం అంటే ఏమిటి అని మరోసారి చెప్పాడు. మనం ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పనులు చేయించవచ్చు.. ముఖ్యమంత్రి కావడమే రాజకీయ లక్ష్యం కాదు.. సామాజిక మార్పు తేవడమే అసలైన రాజకీయం అని చెప్పారు. అసెంబ్లీలో అధికారపార్టీని నిలదీసి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చునని, ఊపిరి ఆడకుండా చేయవచ్చునని చెప్పారు. ప్రభుత్వంతో పని చేయించడమే అసలు రాజకీయం అన్నారు.

 

ఇంకా పీఆర్పీ గురించి మాట్లాడుతూ... పీఆర్పీలో నిస్వార్థపరులు ఉంటే చిరంజీవి సీఎంగా ఉండేవారన్నారు. తన సోదరుడు చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ నేను మాత్రం చిరంజీవిలా మంచి వ్యక్తిని కాదని.. చిరంజీవిలో ఉన్నట్లు సహనం, మంచితనం నాలో లేవని చెప్పారు. ప్రజారాజ్యం నుంచి నేర్చుకున్న పాఠాలతో జనసేన నిర్మించానని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో తాను నిస్సహాయుడిని.. ఆ సమయంలో అల్లు అరవింద్ తనను ఓ నటుడిలా చూశారని చెప్పారు. రామ్ చరణ్ తేజ్, బన్నీ లా తనను కూడా ఓ నటుడిలాగే చూశారని చెప్పారు. అందుకే తాను ఏం చేయలేని పరిస్థితి అన్నారు.

 

అంతేకాదు పనిలో పనిగా పరకాలపై కూడా మండిపడ్డారు. పరకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్‌లు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చిరంజీవి నోరు లేని వ్యక్తి కాబట్టే పరకాల తిట్టేసి వెళ్లిపోయారని.. ఆ సమయంలో తాను ఉండి ఉంటే సందర్భం మరోలా ఉండేదన్నారు. పరకాల వంటి నిబద్దత లేని వ్యక్తులు జనసేనకు అవసరం లేదన్నారు. నాడు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని పరకాల తిట్టారు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని  నిలదీశారు. తన సతీమణిని మాత్రం కేంద్ర కేబినెట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. మొత్తానికి పవన్ విశాఖ పర్యటనలో తనను విమర్సించిన వాళ్లందరికీ గట్టిగానే సమాధానం చెబుతున్నట్టు కనిపిస్తోంది. మరి చూద్దాం.. పవన్ ఇంకెర్ని టార్గెట్ చేస్తాడో..