చంద్రబాబులోని ఆ లక్షణం… పవన్‌కు ఎంతో అవసరం! 

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో… ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు సీనియర్ మోస్ట్! ఆయనకంటే ఎక్కువ రాజకీయ జీవితం గడిపిన వారు చాలా తక్కువ. అయితే, ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో అందరూ బాగా గుర్తించేది చంద్రబాబులోని అభివృద్ధి చేయగల సత్తా, కష్టపడి పని చేసే తత్వం, దూరదృష్టి… ఇలాంటివన్నీ! కానీ, ఏపీ సీఎంలో మరో గొప్ప లక్షణం వుంది. అది చాలా వరకూ పెద్దగా చర్చకు రాదు. అదేంటంటే… చంద్రబాబు ఏనాడూ తన ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా దూషించరు! ఒక్కసారి మనం వెనక్కి వెళ్లి చూస్తే చంద్రబాబు పర్సనల్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కనిపించదు! ఇది నిజంగా ఈనాటి రాజకీయ నాయకులు ఆయన నుంచీ తప్పక నేర్చుకోవాల్సింది. మరీ ముఖ్యంగా, చంద్రబాబును ఢీకొంటున్న ఆంధ్రా యువనేతలు జగన్, పవన్!

 

 

రాజకీయాల్లో విమర్శలు తప్పవు. అంత వరకూ ఓకే. కానీ, విమర్శలకు , వ్యక్తిగత దూషణలకు చాలా తేడా వుంటుంది. ఇక్కడే చంద్రబాబు లాంటి పరిణతి చెందిన నేతలు తమ విజ్ఞత చూపిస్తారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్ చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేస్తుంటారో మనకు తెలిసిందే. ఆయన పార్టీలోని రోజా లాంటి నేతల పదజాలం స్థాయి కూడా మనకు తెలిసిందే. అయితే, జగన్ తాజా టార్గెట్ పవన్ కళ్యాణ్ అయ్యారు! పవన్ ఈ మద్యే జగన్ను విమర్శించారు. ఏమని? ఆయనలాగా తనకూ కొందరు ఎమ్మెల్యేలు వుండి వుంటే తాను అసెంబ్లీ వదిలి వెళ్లే వాడ్ని కానని అన్నారు. జనం ఓట్లు వేసి పంపినందుకు సభలోనే ప్రభుత్వాన్ని నిలదీసేవాడ్ననని పవన్ అన్నారు! దీనిపై జగన్ ఎలా స్పందించాలి? తాను ఎందుకు సభను వదిలి పాదయాత్ర చేస్తున్నాడో చెప్పుకోవాలి. అంతే తప్ప పవన్ పై వ్యక్తిగత దూషణలు అవసరమా? కానీ, మెచ్యూరిటీ లేని జగన్ అదే చేశారు!

 

 

పవన్ కళ్యాణ్ కార్లు మార్చినంత తేలిగ్గా పెళ్లాల్ని మారుస్తారనీ, ఆయనకు నలుగురు భార్యలని జగన్ దెప్పిపొడిచారు! ఇదెక్కడి సంస్కారం? పవన్ కళ్యాణ్ ఎక్కువ పెళ్లిల్లు చేసుకోవటం, వారికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వటం అంతా, అందరికీ తెలిసిందే! ఎలాంటి రహస్యమూ లేని ఆయన వ్యక్తిగత జీవితాన్ని, పైగా ఆయన భార్యల్ని కూడా రాజకీయ రచ్చలోకి లాగటం జగన్ కు సరైందేనా? అస్సలు కాదు!

 

 

ఇక… ఒకవైపు పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ చెలరేగిపోతుంటే… జనసేనాని కూడా ఏం తక్కువ తినలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా ఇంట్లో తుపాకులు పేల్చి బయట తిరుగుతున్న వారి సంగతేంటి అంటూ పరోక్ష విమర్శలు చేశారు. ఇవి టీడీపీ నేత, టాలీవుడ్ హీరో బాలకృష్ణను ఉద్దేశించినవే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ బాలకృష్ణ పేరైతే ఎత్తలేదుగాని ఆయన మొత్తం మీద ఎవర్నో వ్యక్తిగతంగా టార్గెటైతే చేశారు. ఆయన అలా చేయటానికి కారణం… జనసేన కార్యకర్తలు వాహనాలకు సైలెన్సర్లు లేకుండా ఓ ర్యాలీ తీశారట. దాంట్లో పవన్ కూడా పాల్గొన్నారు. విపరీతంగా శబ్దం చేస్తూ సైలెన్సర్లు లేని బండ్లు రోడ్డు మీద తిరిగాయి. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

రూల్స్ కు విరుద్ధంగా రోడ్డు మీద వెహికల్స్ నడపవచ్చా? అభిమానులు అలా చేసినా పవన్ వారించకుండా వుండవచ్చా? ఇవన్నీ పక్కన పెట్టి పవన్ ఎదురుదాడి చేస్తూ బాలకృష్ణపై పరోక్ష విమర్శలు సంధించారు. అసలు ఆయనకు , వివాదానికి ఏమైనా సంబంధం వుందా? ఇక్కడే పవన్ చంద్రబాబు లాంటి నేతల నుంచీ చాలా నేర్చుకోవాలి. ఒక పార్టీ అధినేతగా ఆయన స్థాయిని తగ్గించుకునే చౌకబారు వ్యక్తిగత విమర్శలు ఎప్పటికైనా చేటే చేస్తాయి. జనసేన అధినేతకే కాదు… ఇదే సూత్రం వైసీపీ నాయకుడికి కూడా వర్తిస్తుంది! తాత్కాలిక లాభం కోసం వ్యక్తిగత దూషణలు ఎంత మాత్రం సంస్కారం అనిపించుకోవు!