పవన్ కళ్యాణ్ అనే నేను

 

తమిళనాడులో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కాంగ్రెస్‌, బీజేపీలే కారణమని ధ్వజమెత్తారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందిని విమర్శించారు. రాజకీయంలో మార్పు రావాలి. అందుకోసం దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ప్రముఖులను మేధావులను కలిశా. నేను ఇప్పుడు తమిళనాడుకు రావడానికి కూడా కారణం ఉంది. తమిళనాడుకు జనసేనను పరిచయం చేద్దామని వచ్చా. నా పేరు పవన్‌ కళ్యాణ్.. ఇది జనసేన. ఇక్కడ నేను పలువురు రాజకీయ నేతలను కలుస్తా. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ వంటి పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాయి. అందుకే నిజమైన పార్టీల అవసరం ఇప్పుడు ఏర్పడింది. జల్లికట్టు కోసం మీరు పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం. యువత ముందుకు వస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలరో జల్లికట్టు నిరూపించింది అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు స్నేహితుడుగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని.. ఆయనతో ప్రయాణం ప్రమాదకరమన్నారు. టీడీపీ నుంచి ఏమీ ఆశించకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తే జరిగింది శూన్యమన్నారు. ఎన్నో ఆశలతో 2014లో ఏపీలో చంద్రబాబును సమర్థించా. కానీ మొత్తం తారుమారు అయింది. టీడీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. ప్రాజెక్టుల నుంచి ప్రతి చోట అవినీతి తాండవిస్తోంది. అది వైట్‌కాలర్‌ అవినీతి. ప్రతి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లపైనే అవినీతి జరిగింది అని ఆరోపించారు. చంద్రబాబు రిటైర్‌మెంట్‌ తీసుకునే సమయం దగ్గర పడింది. ఆయన తనయుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేడు. అలాంటిది పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఉంది. ఏపీ భవిష్యత్‌ జనసేనదే అని అభిప్రాయపడ్డారు. తాను సీఎం అయితే దేశ రాజకీయాల్లో దక్షిణ భారతదేశం క్రీయాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. ద్రవిడుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తానన్నారు. అయితే తాను ప్రత్యేక ద్రవిడ దేశం వాదనను సమర్థించనని.. దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రత్యేకతను గుర్తించమని కోరుతున్నట్టు తెలిపారు. జాతీయస్థాయి కూటమి ఏర్పాటులో చంద్రబాబు ప్రయత్నాలు సత్ఫలితాలు అందివ్వవన్న పవన్.. జాతీయ రాజకీయాల్లో మూడో కూటమి అవసరమని స్పష్టం చేశారు.