పవన్ కళ్యాణ్ … టీడీపీ, వైసీపీల ముంగిట తీరం దాటని తుఫాన్!

పవన్ కళ్యాణ్ … నిన్న మొన్నటి దాకా పార్ట్ టైం పొలిటీషన్. ఫుల్ టైం హీరో. కానీ, ఇప్పుడు ఫుల్ టైం జనం మధ్యనే గడుపుతోన్న జనసేనాని! అయితే, ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే…. పవన్ స్ట్రాటజీ ఏంటి? ఆయన నేరుగా ఎన్నికల్లో పాల్గొనకున్నా 2014లో తీవ్రంగా ప్రచారం చేశారు. చంద్రబాబును, మోదీని సమర్థించారు. మరిప్పుడు? ఆ ఇద్దర్నీ వ్యతిరేకిస్తున్నారు! కొంత కాలం కాకినాడ, అనంతపురాల్లో సభలు నిర్వహించినప్పుడు మోదీని తెగ తిట్టి, బాబును సున్నితంగా విమర్శించారు. ఇప్పుడు సీన్ రివర్స్ చేసేశారు. చంద్రబాబును, లోకేష్ ను, టీడీపీని అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు. అలా అని పవన్ బీజేపీ వైపున కూడా వుండటం లేదు. జగన్ను కూడా ఉపేక్షించటం లేదు. అందర్నీ విమర్శిస్తూ ఒంటరిగానే బరిలో తొడగొడుతున్నారు. దీని వల్ల ఆయనకెంత లాభం? ఇతర పార్టీలకు ఎంత నష్టం? ఎన్నికల ఫలితాలొచ్చే దాకా సస్పెన్సే!

 

 

పవన్ పోరుయాత్ర చేస్తూ ఉత్తరాంధ్ర దాటి కోస్తాంధ్రలోకి ప్రవేశించారు. అయితే, రోజురోజుకి ఆయన ఆరోపణలు, మాటలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాస్త సన్నిహితంగా వున్నా దాదాపుగా జనసేనాని యుద్ధం ఒంటరిగానే అని తేలిపోతోంది. పవన్ తాజాగా జగన్ని టార్గెట్ చేశారు. తనకు పది మంది ఎమ్మెల్యేలు వున్నా అసెంబ్లీ వదిలి పారిపోయేవాడ్ని కానని చెప్పారు. జగన్ మంచి అవకాశాన్ని అసెంబ్లీ సాక్షిగా పాడు చేసుకున్నారని అన్నారు. కానీ, ఇదే సమయంలో టీడీపీని, నేరుగా చంద్రబాబునే ఇరుకునే పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు జనసేన అధినేత!

 

 

చంద్రబాబు తనను గతంలో ప్రత్యక్ష పోరుకు దిగవద్దని అన్నారని చెప్పిన పవన్ అందుకు ప్రతిగా రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారంటూ పేర్కొన్నారు. కానీ, తనకు రాజ్యసభ సీటు ఇస్తానన్న సంగతి మరుసటి రోజుకే పత్రికలకు లీకు చేయించారని పవన్ ఆరోపించారు. ఇది ఎప్పుడో 2014కి ముందు జరిగింది. దీన్ని ఇప్పుడు పవన్ బయటపెట్టటం ఏంటి? కేవలం చంద్రబాబు ఇమేజ్ ని ఎంతో కొంత డ్యామేజ్ చేయటమే దీని ఉద్దేశం అయి వుండాలి. ఇక ఇలాంటి ఆరోపణలు ఎంత వరకూ ఓట్లు రాలుస్తాయో కూడా చూడాలి!

 

 

ఒకవైపు చంద్రబాబును, మరోవైపు జగన్ను వ్యతిరేకిస్తోన్న పవన్ గత కొంత కాలంగా మోదీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఘాటు విమర్శలు కాదు కదా… కనీస ఎత్తిపొడుపులు కూడా వుండటం. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెలరేగిన పవన్ సడన్ గా ఇలా ఎందుకు మెత్తబడ్డారో ఆయనకి, మోదీకే తెలియాలి. కానీ, రానున్న ఎన్నికల్లో పవన్ కీలక శక్తి మాత్రం కానున్నారని ఆయన తాజా విమర్శల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే, పవన్ బోలెడు మంది ఎమ్మెల్యేల్ని గెలుచుకుంటారని అర్థం కాదు! ఆయన పార్టీ నిలబెట్టే అభ్యర్థుల వల్ల చంద్రబాబుకో, జగన్ కో డ్యామేజ్ పక్కా. అది ఎవరవుతారో వాళ్లు అధికారానికి దూరమవ్వమూ ఖాయం. మొత్తానికి పవన్ తాను తినకుండా ఎవరు తినకూడదో డిసైడ్ చేయబోయే ప్రమాదకర శక్తిగా మారనున్నరన్నది గ్యారెంటీ!