విమర్శలు లేవు..విన్నపాలే..పవన్,గవర్నర్ భేటీ

 

తిత్లీ తుఫానుతో శ్రీకాకుళం అతలాకుతలం అయింది.తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పవన్ పర్యటించారు.పవన్ పర్యటనపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు.తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ ఆలస్యంగా పర్యటించారని, ఆయనది దొంగ ప్రేమ అని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. ఇందుకు ధీటుగా పవన్ టీడీపీపై విమర్శలు గుప్పించారు.తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని, సాయంపై అందరూ తలోమాట మాట్లాడుతున్నారని పవన్ విమర్శించారు.కానీ గవర్నర్ నరసింహన్‌ మాత్రం చంద్రబాబు ప్రభుత్వం కృషి భేష్ అంటూ కితాబిచ్చారు.ఈ నేపథ్యం లో పవన్ కల్యాణ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని వివరించడానికి గవర్నర్‌ను అపాయింట్‌మెంట్ కోరారు.దీంతో నరసింహన్ అపాయింట్‌మెంట్ ఇవ్వగా పవన్ ఆయనతో భేటీ అయ్యారు.తాజాగా నరసింహన్ తో పవన్ భేటీ ముగిసింది.

 

 

భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.తిత్లీ తుఫాన్ బాధితుల్ని ఆదుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు పవన్ చెప్పారు.తిత్లీ తుపాను నష్టంపై తమ పార్టీ రూపొందించిన నివేదికను గవర్నర్‌కు అందజేశామన్నారు.తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని.. అక్కడ గతంలో ఉన్న పరిస్థితి రావాలంటే కనీసం 15-20 ఏళ్లు పడుతుందని చెప్పారు.కేరళలో వరదలు వచ్చినప్పడు నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయం బయట ప్రపంచానికి తెలిసిందని, ఉద్దానంలో నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా పూర్తిస్థాయిలో అది బయటకు చూపించలేదనే ఆవేదన అక్కడి ప్రజల్లో ఉందని పవన్‌ తెలిపారు. ప్రజల్లో ఉన్న స్పందననే నివేదిక రూపంలో గవర్నర్‌కు అందజేశామన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే సాయం చేసేలా చూడాలని గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చామని పవన్ వెల్లడించారు.తిత్లీ తుఫాన్ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు.