పేదలకు జనసేన అండ.. డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలు ప్రారంభించిన పవన్

 

ఆకలి అన్నవారికి రాత్రి పగలు అనే తేడా లేకుండా స్వయంగా తన చేతులతో అన్నం వండి పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. కష్టాల్లో ఉన్నవారిని.. పేదలను ఆదుకొంటూ..లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన అపర అన్నపూర్ణ ఈ సీతమ్మ. ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణ అనే ప్రసిద్ధమైన పేరుతో.. ఖండాంతర ఖ్యాతి గడించారు. 'అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అనే మాట వింటూనే ఉంటాం..కానీ అన్నదానానికి మించిన దానంలేదని నమ్మిన అమ్మ డొక్కా సీతమ్మ. అమ్మ అనే పదానికి అసలైన నిర్వచనం చెప్పిన మహా మానవతా మూర్తి. తన ఇంట్లో రోజుకు 24 గంటలూ పొయ్యి వెలుగుతునే ఉండేది. అంతటి మహోన్నత అన్నదాత  పేరుతో అన్నదాన శిబిరాలను ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 

ఇసుక కొరత కష్టాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలను ప్రారంభించి ఆహారాన్ని అందిస్తున్నారు పవన్ కళ్యాణ్. నేడు ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఆయనే స్వయంగా ప్లేట్లల్లో ఆహారాన్ని వడ్డించి కార్మికులకు అందించారు. పేదలకు అండగా ఉండే ఇటువంటి కార్యక్రమాలను చెప్పటాలని.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలని  పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. 

ఇసుక కొరతతో ఏపీలోని భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం అందరికి తెలిసిందే. కార్మికులకు అండగా ఇప్పటికే జనసేన పలు కార్యక్రమాలను చేపట్టింది. అధికార ప్రభుత్వంపై కూడా ఘాటుగా విమర్శలు చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు. ఇసుక కొరత నివారించకుండా ఇసుక వారోత్సవాలను ఎలా నిర్వహిస్తారంటూ పవన్ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా నిలబడతానని హామీ ఇచ్చారు జనసేనాని పవన్. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ‘డొక్కా సీతమ్మ’ పేరుతో క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తానని ఎన్నికల సమయంలో పవన్ చెప్పిన విషయం తెలిసిందే.