చంద్రన్న, జగనన్న పేర్లతో పథకాలు ఎందుకు?

 

కృష్ణా జిల్లా నూజివీడులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు చంద్రబాబుపై కోపంతో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామంటున్నారని, ఇవ్వాలంటే వారు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలని సవాల్‌ చేశారు. ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనన్నారు. వరంగల్‌లో వైఎస్ జగన్‌ను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్లు రాళ్లతో కొట్టి తరిమారని పవన్‌ గుర్తుచేశారు. ఏపీ ప్రజలకు పౌరుషం లేదా? తెలంగాణ నేతలకు బానిసలమా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పాటు ఏమీ చేయని జగన్‌.. సీఎం అయితే ఇంకేం చేస్తారని నిలదీశారు.

నూజివీడును ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. నూజివీడులో అంతర్జాతీయ మామిడి పండుగ చేద్దామని, స్పెయిన్‌లో టమాటో పండుగలా నూజివీడు అండే మామిడి పళ్లు గుర్తుకు రావాలని అన్నారు. 'మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సీఎం అవుతున్నా.. ప్రమాణస్వీకారం చేస్తా' అని జనసైనికుల్లో ఉత్సాహం నింపారు. జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలకు డొక్కా సీతమ్మ, కందుకూరి, కాటన్‌ దొర, అంబేద్కర్ వంటి మహానీయుల పేర్లు పెడతామని చెప్పారు. చంద్రన్న, జగనన్న పేర్లతో పథకాలు ఎందుకు? అని ప్రశ్నించిన పవన్.. తన పేరుపై భవిష్యత్తులో ఒక్క పథకం కూడా ఉండబోదని చెప్పారు. '25 కిలోల బియ్యం, రూ. 2500 ఇవ్వడానికి రాజకీయాల్లోకి రాలేదు. మీ 25 సంవత్సరాల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఇవ్వడానికి రాజకీయాల్లో వచ్చాను’ అని అన్నారు. డబ్బుతో సంబంధం లేని రాజకీయాలు చేద్దాం రండి అంటూ పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు.