బీజేపీ నేతలతో మరోసారి భేటీ కానున్న జనసేనాని.. ఏం జరగబోతోంది?

పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన ఏపీలో  హాట్ టాపిక్ గా మారింది. వారం రోజుల వ్యవధి లోనే మరోసారి బీజేపీ పెద్దలతో భేటీ చర్చనీయాంశమైంది. జనసేన అధినేత హస్తినకు వెళ్ళడంలో ఆంతర్యమేంటని, రాజధాని మార్పు ఉండదన్న పవన్ ధీమా వెనక కారణమేంటన్న చర్చ అందరిలో మొదలైయ్యింది.బిజెపి నేతలు పవన్ తో ఏ అంశాల పై చర్చించనున్నారు, అమరావతి పై ఇరు పార్టీల కార్యాచరణ ఎలా ఉండబోతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజధాని వాసులు.రాజధానిగా అమరావతికి  జై కొట్టాయి బిజెపి జనసేన. ఈ నేపధ్యంలో మిత్రపక్షాలైన ఇరు పార్టీలూ క్యాపిటల్ ఇష్యూపై ఎలా ఉద్యమించాలి, చేపట్టాల్సిన ఆందోళనలపై చర్చించ నున్నట్లు సమాచారం. ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా ఢిల్లీ లోనే ఉండడంతో అక్కడి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం.రాజధాని మార్పు భవిష్యత్ కార్యాచరణతో పాటు పొత్తుకు సంబంధించిన పలు కీలక అంశాల పై కమలం పార్టీ అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు.

రాజధాని మార్పు అంశం ఏపీని కుదిపేస్తోంది. వైసీపీ సర్కారు ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీని పై రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో అట్టుడికిపోతున్నాయి. 36 రోజులుగా భూములిచ్చిన రైతులు రిలే దీక్షలు చేస్తున్నారు.రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు నిరసనలు తెలుపుతున్నారు.రాజధాని ఎక్కడికి వెళ్ళదని అమరావతి లోనే ఉంటుందని, జగన్ సర్కారును కూల్చడమే తన లక్ష్యమని  పవన్ కళ్యాణ్ ప్రకటించారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఎలా ముందుకెళ్తారోనని వారి సమస్యకి కనీసం ఏదైనా ఉపశమనం దొరుకుతుందేమో అని రాజధాని రైతులు ఎదురు చూస్తున్నారు.