టీఆర్ఎస్ గెలుపుపై పవన్ కళ్యాణ్ స్పందన

 

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావులకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. ‘తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు. ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’ అని లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.