ఇంటిపేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్

 

రాజానగరంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చట్టాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీనిని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. దీంతో రైతులకు నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణలో కూడా ఈ కారణంగానే రైతులు నష్టపోయారన్నారు. మరోసారి టీడీపీకి అధికారం అప్పగిస్తే ఏదో పథకాల పేర్లు చెప్పి రైతులకు మిగిలి వున్న భూములను కూడా లాగేసుకుంటారన్నారు. అవినీతి రహిత పరిపాలన తీసుకురావాలన్నదే తన ద్యేయమన్నారు.

జనసేన అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తామని, నాణ్యమైన విద్య అందేలా శ్రద్ధ వహిస్తామని, దివ్యాంగులకు వారి ఇంటికే వెళ్లి పింఛను అందజేస్తామన్నారు.మహిళల కష్టాలు తీరే విధంగా మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాను ఒక కులానికో, కుటుంబానికో చెందిన వాడిని కాదని, తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తిని అంటూ తన ఇంటిపేరు కొణిదెల కాదని, తెలుగు అని ప్రకటించారు. టంగుటూరి పౌరుషం, పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం నేటి పాలకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదని, వీటిని కాంగ్రెస్‌ నాయకులు తాకట్టుపెట్టారన్నారు.