బీజేపీతో జనసేన పొత్తు....పవన్ మాటలకి అర్ధం అదేనా ?

 

ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచలనం లాంటి భారీ సమీకరణాలు జరగబోతున్నాయా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే. గత నెలలో అమెరికాలో పర్యటించిన ఆయన బీజేపీ నేత రామ్ మాధవ్ తో చర్చలు జరిపారు. ఆ సమయంలో జనసేనను బీజేపీలో కలిపేస్తారని ప్రచారం జరగగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచనేది లేదని అప్పుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

గతంలో బీజేపీతో కలిసి పనిచేసిన విషయం గుర్తుచేసి  ‘ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీని కోరుతున్నానే తప్ప.. వ్యక్తిగతంగా ఆ పార్టీతో సమస్య లేదు. ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలని బలమైన కోరిక ఉంటే.. నేనే కాదు, ప్రస్తుత ప్రభుత్వం సహా ఎవరైనా సరే దాని కోసం పోరాడాల్సిందే’ అని పవన్ అపట్లో చెప్పుకోచ్చారు.  సొంత ప్రయోజనాలు చూసుకుంటే టీడీపీ, బీజేపీలతో ఎందుకు గొడవ పడతానని, గెలిచే సీట్లు తీసుకొని వారితో కలిసేవాడిని కదా అని ఆయన చేసిన వ్యాక్యాలు అప్పట్లోనే చర్చనీయాంశం అయ్యాయి. 

తాజాగా పవన్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలతో పాటు.. మరికొన్ని కమిటీలను నియమించారు. పీఏసీ మీటింగ్‌లో.. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్య పరిచాయి. పార్టీ పొలిటి క‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. కొన్ని జాతీయ పార్టీలు త‌మ‌తో క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని కోరుతున్నాయ‌ని వివ‌రించారు. ఎవ‌రితో ప్ర‌యాణం చేసినా లౌకిక పంథాను వీడబోమ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

జ‌న‌సేన అధినేత వ్యాఖ్య‌ల‌ను లోతుగా ప‌రిశీలిస్తే ఈ మ‌ధ్య కాలంలో బీజేపీ నేత‌లు మాత్ర‌మే ప‌వ‌న్‌తో మంత‌నాలు సాగించారు. లౌకిక పంథా అని చెప్పుకునేది బీజేపీ మాత్రమే కావడంతో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. విలీనం ఉండ‌దు కానీ ఎవరితో ప్ర‌యాణం చేసినా రాష్ట్రం కోసమే అంటూ ముక్తాయింపు ఇవ్వ‌టంతో జ‌న‌సేన ఇక బీజేపీతో క‌లిసి న‌డ‌వ‌టానికి సిద్దం అవుతున్న విష‌యం స్ప‌ష్టం అవుతోంది. 

నిజానికి భాజపా ఎప్పుడూ జనసేన పార్టీని విలీనం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి మంచి ఫలితాలను సాధించిన క్రమంలో అమిత్ షా నుంచే ఈ విలీనం ఆఫర్ పవన్ కల్యాణ్‌కు వచ్చింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని ఆఆయన అప్పట్లో ఆఫర్ చేశారు. 

పవన్ కల్యాణ్ ప్రచారంలో చాలా సార్లు ఈ మాట చెప్పారు.  అయితే పవన్ మాత్రం పార్టీ నడపాలనే ఉద్దేశంతోనే ఉన్నారు, ఎందుకంటే తన అన్న చిరంజీవి ఉదాహరణ లైవ్ గా కనిపిస్తూ ఉండి ఉండవచ్చు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం లోపే ఓట్లు రాగా జనసేన పార్టీకి ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఒకరకంగా తాజా ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌రువాత సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న టీడీపీ కంటే ముందుగానే ప‌వ‌న్ కోలుకున్నారు. 

ఆ వెంట‌నే పార్టీ శ్రేణుల్లో భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. స‌డ‌న్‌గా జ‌న‌సేన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ..పొలిట్ బ్యూరో ప్ర‌క‌టించారు. బీజేపీ మాత్రం టీడీపీ ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి ప్లాన్ చేస్తింది. అందు కోసం వలసలను ప్రొత్సహించి గేట్లు ఎత్తినా ఏపీలో మోడీ మానియా పని చేసే పరిస్థితి లేకపోవడంతో పవన్ తో పొత్తుకి సైతం సిద్దం కావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీతో కలిసి నడిచే విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. చూద్దాం మరి ఏమవుతుందో ?