చంద్రబాబు డెసిషన్ కోసం పవన్ వెయిటింగా...?

 

ఎంతో ఆశతో ఎదురుచూసిన తెలుగు ప్రజల కళ్లల్లో కేంద్రం ఎప్పటిలాగే దుమ్ముకొట్టింది. బడ్జెట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ఇక కేంద్రం చేసిన ఈపనికి రాజకీయ నాయకులు..రాజకీయ విశ్లేషకులతోపాటు తెలుగుప్రజలసైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాస్త అటుఇటూగా ఉన్న అన్ని వైపులా నుండి తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికీ స్పందించకపోతే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయనకు సీనియర్లు, ఎంపీలు తేల్చి చెప్పారు. దీంతో సీఎం మాట్లాడుతూ జరిగిన అన్యాయంపై ఆదివారం జరిగే పార్లమెంటరి సమావేశంలో రాజకీయ నిర్ణయం తీసుకుందామని, అయితే, తొందరపడి ఎవరూ ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రులకు సూచించారు.

 

ఇదంతా ఒకఎత్తైతే...అసలు కేంద్రం చేసిన ఈ పనికి జనసేన అధినేత పవన్ ఇంత వరకూ స్పందించలేదు.  ప్రశ్నిస్తానన్న 'పవన్‌కళ్యాణ్‌' ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్న ఆయన అభిమానులతో పాటు..అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలోనే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకటే హడావుడి చేసిన 'పవన్‌' ఇప్పుడు నోరెత్తకపోవడంపై పలు సందేహాలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని...ఆ స్థానంలో ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం అప్పుడెప్పుడో ప్రకటన చేసినప్పుడు 'పవన్‌కళ్యాణ్‌' ఆవేశంగా స్పందించారు. పాచిపోయిన లడ్డూలంటూ కౌంటర్లు కూడా విసిరారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదని అంటున్నారు.

 

అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు స్పందన కోసం ఎదురుచూస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. కేంద్రంపై పోరాటం చేయడానికి తన శక్తి సరిపోదని భావిస్తున్న పవన్ కళ్యాణ్… ఈ విషయంలో చంద్రబాబు ముందడుగు వేస్తే తాను ఆయన వెంట ఉండాలనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీ నేతలతోనే కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత… బీజేపీ, కేంద్రంతో పోరాడాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకోసం ఆయన మరింత సమయం తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే పార్టీ నేతలంతా ఈ విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నా… వారిని సముదాయించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో చంద్రబాబు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకుని కేంద్రంపై పోరాడాలని నిర్ణయం తీసుకుంటే… టీడీపీతో కలిసి బీజేపీని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని పలువురు జనసేన నాయకులు చెబుతున్నారు.

 

ఇదిలా ఉంటే.. వైసీపీ కేంద్రం చేసిన పనిపై పెద్దగా స్పందించే పరిస్థితి లేదన్నట్టే కనిపిస్తోంది. ఏదో నామ్ కే వాస్త్ జగన్ కేంద్రంపై నాలుగు మాటలు గుప్పించారు తప్పా... ఈ విషయంలో వైసీపీ సైలెంట్ గానే ఉంటుందని అర్దమవుతోంది. ఒకవేళ టీడీపీ కనుక బీజేపీతో విడిపోతే తాము బీజేపీతో కలవొచ్చని జగన్ బాధ. మరి బీజేపీతో కలిస్తే జగన్ ఎంత లాభమో తెలీదు కానీ... వైసీపీతో కనుక బీజేపీ కలిస్తే... ప్రస్తుతం బీజేపీపై ఉన్న కోపానికి తెలుగు ప్రజలు వైసీపీని ఎలా తొక్కాలో అలా తొక్కేస్తారు. అందుకే పవన్ వైసీపీ ఎలాగూ బీజేపీతో కలవాలని చూస్తుంది కాబట్టి.. ఆపార్టీతో పెట్టుకోవడం వేస్ట్ అని.. అందుకే చంద్రబాబు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడని పలు రాజకీయవర్గాల టాక్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.